AP

టిడిపిలో రాయపాటి టికెట్ల బేరం. చంద్రబాబు ఏం చేస్తారో?

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు టికెట్ల కోసమని మీడియాతో మాట్లాడుతున్న టిడిపికి,ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఆయన తన కొడుకు రంగబాబుకి సత్తెనపల్లి లేదా పెదకూరపాడులోగానీ టికెట్‌ ఇవ్వాలని, అలాగే తన తమ్ముడు కూతురు శైలజకు కూడా తప్పనిసరిగా టికెట్‌ ఇవ్వాలని రాయపాటి సాంబశివరావు అంటున్నారు.

చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా పోటీ చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని, కానీ వారిద్దరికీ టికెట్స్ ఇస్తే తాను టికెట్‌ కోసం పట్టుబట్టనని టిడిపికి ఆయన మరో ఆప్షన్ కూడా ఇస్తున్నారు. గత ఎన్నికల సమయంలో తన వద్ద తగినంత డబ్బు లేక ఓడిపోయానని కానీ ఈసారి పుష్కలంగా ఉందన్నారు. పైగా ఈసారి టిడిపి ప్రభంజనం కూడా ఉంటుంది కనుక తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా తప్పకుండా గెలుస్తానని చెప్పారు. నరసారావుపేటలో స్థానికులకే టికెట్‌ ఇవ్వాలి తప్ప కడప లేదా కర్నూలు జిల్లాల నుంచి అభ్యర్ధిని తెచ్చి నెత్తినపెడితే భరించబోమని రాయపాటి సాంబశివరావు తేల్చిచెప్పేశారు.

కడప జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ గత రెండు ఎన్నికలలో మైదుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా నేటికీ ఆయనే మైదుకూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. ఆయన కుమారుడు, ప్రముఖ వ్యాపారవేత్త పుట్టా మహేష్ యాదవ్‌కు చంద్రబాబు నాయుడు ఈసారి నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని ఆలోచిస్తున్నారు. అందుకే రాయపాటి సాంబశివరావు ఈవిదంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి పెంచుతున్నారు.

ఒకవేళ పుట్టా మహేష్ యాదవ్‌కే టికెట్‌ ఇచ్చే మాటయితే తానే స్వయంగా బరిలో దిగాల్సివస్తుందని, తన ముందు ఎవరూ నిలవలేరని రాయపాటి సాంబశివరావు ఇదివరకే హెచ్చరించారు. అంటే తనకు, తన కొడుకు, తమ్ముడు కూతురికే టికెట్లు ఇవ్వక తప్పదని హెచ్చరిస్తున్నారనుకోవచ్చు.

రాయపాటి సాంబశివరావుకి, ఆయన కుటుంబ సభ్యులకి టికెట్లు ఇస్తే వారు తప్పకుండా విజయం సాధించగలరు కానీ ఆ నియోజకవర్గాల నుంచి టిడిపిలో పోటీ చేయాలనుకొంటున్న పుట్టా కుటుంబం, డిఎల్ రవీంద్రా రెడ్డి వంటివారు తీవ్ర అసంతృప్తికి గురవుతారు. దాని వలన పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కనుక ఉమ్మడి గుంటూరు జిల్లాలో టిడిపికి నష్టం కలగకుండా ఈ రాయపాటి టికెట్ల పంచాయతీని చంద్రబాబు నాయుడు ఎలా పరిష్కరిస్తారో చూడాలి