AP

పవన్ ఎఫెక్ట్ – హరిరామ జోగయ్య కీలక నిర్ణయం..!

సీనియర్ రాజకీయనేత చేగొండి హరిరామజోగయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో తాను స్థాపించిన కాపు సంక్షేమ సేనను రద్దు చేశారు. ముద్రగడ పద్మనాభం కాపు సంక్షేమ పోరాటం నుంచి విరమించు కున్న దశలో జోగయ్య కాపు సంక్షేమ సేన ఏర్పాటు చేసారు. పవన్ కల్యాణ్ కు మద్దతుగా లేఖల ద్వారా పలు సూచనలు చేసారు. పొత్తుల్లో భాగంగా సీట్ల విషయంలోనూ జోగయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పుడు తన భవిష్యత్ పాత్ర పైన జోగయ్య స్పష్టత ఇచ్చారు.

 

హరిరామజోగయ్య , తాను అధ్యక్షుడిగా ఉన్న కాపు సంక్షేమ సేనను తాత్కాలికంగా రద్దు చేశారు. ఇకపై రాజకీయాల్లో జోక్యం చేసుకోనని, రాజకీయ విశ్లేషకుడిగానే ఉంటానని స్పష్టం చేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ స్థానాలకు అంగీకరించడం హరిరామజోగయ్యను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దీనిపై ఆయన లేఖలు కూడా రాశారు.

 

జోగయ్య పేరు ప్రస్తావన చేయకుండానే సలహాలు ఇచ్చేవాళ్లు వైసీపీ కోవర్టులు అంటూ తాడేపల్లిగూడెం సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాజాగా ఇటీవలే హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ వైసీపీలో చేరారు. దీంతో, పవన్ మరోసారి ఈ చేరికల పైన స్పందించారు. దీంతో, ఇప్పుడు జోగయ్య తన నిర్ణయాన్ని ప్రకటించారు.

 

ఈ నిర్ణయం వేళ కీలక అంశాలతో జోగయ్య లేఖ రాసారు. కాపులను యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తీసుకురావటానికి ప్రయత్నించానే తప్ప.. తన స్వలాభం కోసం ఎన్నడూ చూసుకోలేదన్నారు. ప్రజారాజ్యం కోసం తాను ఎంపీ పదవిని సైతం వదులుకుని పార్టీలో చేరానని గుర్తు చేశారు. తనను పవన్ కల్యాణ్, జనసేన కార్యకర్తలు సహా అందరూ అపార్థం చేసుకున్నారని, కొందరు అమర్యాదగా వ్యాఖ్యలు చేసారని వాపోయారు.

 

చిరంజీవి ప్రజారాజ్యం తీసుకెళ్లి కాంగ్రెస్‌లో విలీనం చేయడం ద్వారా.. తనతో సహా కాపులు నష్టపోయారని చెప్పారు. ఇలాంటి పరిస్థితి.. మళ్లీ ఇప్పుడు రావొద్దన్నదే.. తన ఆవేదనగా చెప్పుకొచ్చారు. కాపు సంక్షేమ సేనలో అన్ని కార్యవర్గాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికలు అయ్యాక కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తానని స్పష్టం చేసారు.