AP

ఉత్కంఠగా అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో కొనసాగుతున్న పొత్తులపై సర్వత్రా ఉత్కంఠ చోటుచేసుకుంది. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తో, ఏపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయి పొత్తులపై చర్చించినట్టు సమాచారం.

 

అయితే పొత్తుల అంశం, సీట్ల సర్దుబాటు అంశంపై గత రెండు రోజులుగా చర్చలు జరుపుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల చర్చలు కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తున్నప్పటికి ప్రధానంగా లోక్సభ ఎన్నికలను టార్గెట్ చేసుకుంటున్న బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 10 లోక్సభ సీట్ల కోసం పట్టు పడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే గురువారం రాత్రి నుంచి ఇప్పటివరకు పలు దఫాలుగా జరుగుతున్న చర్చలలో ఒక క్లారిటీ కి వచ్చినట్టు తెలుస్తుంది.

 

అయితే నేడు మరోమారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఈ క్రమంలో జనసేన, టిడిపి, బిజెపిల పొత్తు ఖరారు విషయంపై సర్వత్ర ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే మొత్తం 175అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25లోక్సభ నియోజకవర్గాలకుగాను, మొత్తం 30అసెంబ్లీ, ఎనిమిది లోక్సభ స్థానాలలో పోటీ చేయాలని ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినట్టు సమాచారం.

 

ఇక మిగిలిన స్థానాలలో తెలుగుదేశం పార్టీ పోటీలో ఉండనుంది. అయితే ఇప్పటికే పొత్తులపై ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో అధికారికంగా ప్రకటన వెల్లడించనున్నారు అని బిజెపి వర్గాలు చెబుతున్నాయి . ఈరోజు ఉదయం 11 గంటలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తో భేటీ అయ్యి అనంతరం అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

 

కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఎన్డీఏ 400 సీట్లలో గెలవాలని పట్టుదలతో ఉంది. ఎన్డీఏ మిత్ర పక్షాలన్నింటినీ ఆహ్వానించి వారితో చర్చలు జరుపుతోంది. ఏపీ నుండి చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు ఈ మేరకు ఆహ్వానం అందింది. చర్చలు పూర్తయినట్టు, అధికారిక ప్రకటనే తరువాయి అని కూటమి నేతలు చెబుతున్నారు. నేడు అధికారిక ప్రకటన కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.