AP

వైసీపీ మూడో జాబితా సిద్ధం..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా రెండు విడతల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 38 మంది కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించింది.

 

ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకు పెద్ద పీట వేశారు. కొన్నిచోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను కల్పించారు. సామాజిక సాధికారతే ఆయుధంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మలి జాబితాలో అన్ని కులాల వారికీ ప్రాతినిధ్యాన్ని ఇచ్చారు.

 

మూడో విడత జాబితాపై కసరత్తు పూర్తయింది. దీనికి తుది రూపాన్ని ఇస్తోంది వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. 25 మంది పేర్లతో ఈ జాబితా వెలువడే అవకాశం ఉంది. ఈ సాయంత్రం దీన్ని విడుదల చేస్తారని తెలుస్తోంది. అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని నియోజకవర్గాలు ఇందులో ఉన్నట్లు సమాచారం.

 

అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కాపు రామచంద్రారెడ్డికి టికెట్ లభించట్లదనే ప్రచారం జరుగుతోంది. టికెట్ దక్కదనే ఉద్దేశంతో ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ ఆయన ప్రకటించారు. రాయదుర్గానికి ఎవరిని నియమించారనేది మూడో విడత జాబితాలో తేలిపోయే అవకాశం ఉంది.

 

కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో కూడా మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి గెలిచిన మంత్రి గుమ్మనూరు జయరాంకు ఈ సారి టికెట్ దక్కకపోవచ్చు. ఈ నియోజకవర్గానికి కొత్త అభ్యర్థిని నియమించే అవకాశం ఉంది. ఈ విషయంపై ఇప్పటికే గుమ్మనూరు జయరాంకు సంకేతాలు వెళ్లాయి. కర్నూలు లోక్‌సభ అభ్యర్థిగానైనా తన పేరును పరిశీలించాలని ఆయన కోరుతున్నారు.

 

తనకు టికెట్ దక్కకపోతే వైఎస్ఆర్సీపీని వీడాలనే ఆలోచనలో గుమ్మనూరు జయరాం ఉన్నారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా జరుగుతోంది. వైఎస్ షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌గా అపాయింట్ అవుతారంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో – ఆయన కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పుకోవచ్చని చెబుతున్నారు.