CINEMA

హీరోల కన్నా ప్రేక్షకులు చాలా తెలివి మీరిపోయారు

స్టార్ హీరోలం కాబట్టి మేం ఎలా నటించినా ఎలాంటి సినిమాలు చేసినా వేలంవెర్రిగా ఎగబడి చూస్తారన్న గ్యారెంటీ రోజులు పోయాయి. మొదటి రోజు థియేటర్ కు రావడం అటుంచి అసలు ప్రమోషనే ఆసక్తికరంగా లేనప్పుడు టికెట్లు కొనే సమస్యే లేదని ఆడియన్స్ తేల్చి చెబుతున్నారు.

ఆ మధ్య ఆచార్యలో చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించారని తెలిసినా కూడా చాలా చోట్ల మార్నింగ్ షోలే ఫుల్ కాలేదు. కారణం క్రేజ్ పడిపోవడం కాదు. పబ్లిసిటీలోనే నీరసం వచ్చే కంటెంట్ ఇందులో ఉందనే సందేశం నేరుగా పబ్లిక్ లోకి వెళ్లిపోవడమే.

అక్షయ్ కుమార్ కు గత రెండేళ్లుగా ఇలాంటి సీన్ రిపీటవుతూనే ఉంది. యష్ రాజ్ ఫిలింస్ సామ్రాట్ పృథ్విరాజ్ ని నూటా యాభై కోట్ల బడ్జెట్ తో తీస్తే కనీసం అందులో పావు వంతు వెనక్కు రాలేదు. తాజాగా సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ వస్తోంది. రంజాన్ పండగ సెంటిమెంట్ ని వాడుకుని మరో హిట్ కొట్టొచ్చనే నమ్మకంతో సల్లు భాయ్ ఉత్సాహంగా వస్తున్నాడు. తీరా చూస్తే మల్టీప్లెక్సుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ లక్ష టికెట్లు దాటలేదు. మూడు నెలల క్రితం ఇలాంటి టైంలోనే షారుఖ్ ఖాన్ అయిదు లక్షలకు పైగా ముందస్తు టికెట్లు అమ్మాడు.

ఇక్కడ సల్మాన్ రేంజ్ పడిపోయిందా అంటే అది కాదు. సినిమాలో మ్యాటర్ కనీస స్థాయిలో ఆకట్టుకునేలా లేనప్పుడు పబ్లిక్ మాత్రం ఎందుకు వస్తారు. ఇది ఖచ్చితంగా మొదటి రోజే చూడాలన్న అభిప్రాయం కలిగించాలిగా. పైగా కిచిడి పాటలు, విచిత్రమైన లుంగీ గెటప్పులు గట్రా చూస్తుంటే చెన్నై ఎక్స్ ప్రెస్ ని కాటమరాయుడుని మిక్సీలో వేసి ఏదో ఖంగాళీ చేసినట్టు కనిపిస్తోంది. పాపం బాలీవుడ్ మీద పదే పదే ఆశలు పెట్టుకున్న హీరోయిన్ పూజా హెగ్డేని ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇదంతా దేనికి సంకేతం.

ఆడియన్స్ బాగా తెలివి మీరిపోయారు. ఎంత తక్కువ అంచనా వేస్తే ఆంత ఘోరంగా దెబ్బ తింటాం. అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని అన్నట్టు కోట్ల రూపాయల బడ్జెట్, స్క్రీన్ మొత్తం కనిపించే స్టార్లు ఉండగానే సరిపోదు. కథలో సోల్ ఉండాలి. ఏదో కొత్తగా ట్రై చేశారన్న అభిప్రాయం కలగాలి. అంతే తప్ప పోస్టర్ లో బొమ్మ చూసి గుడ్డిగా వచ్చే రోజులు కావివి. అమీర్ ఖాన్ అంతటివాడికే పరాభవాలు తప్పలేదు నిజంగా స్టార్ డం ప్రతిసారి పని చేసేదే అయితే లాల్ సింగ్ చద్దా లాంటివి కనీస వసూళ్లు తెచ్చేవిగా. హీరోలు గొప్పవాళ్లే కావొచ్చు. కానీ ప్రేక్షకులు అంతకన్నా తెలివిమీరిన వాళ్ళు.