AP

కాకినాడ పోర్టు ఇష్యూ..! ఈడీ రంగంలోకి దిగుతోందా..?

ఏపీలో రాజకీయాలు కాకినాడ పోర్టు చుట్టూనే తిరుగుతున్నాయా? పోర్టు వ్యవహారం వెలుగులోకి రాగానే సీఐడీ రంగంలోకి దిగేసిందా? నిందితులు దేశం విడిచి పారిపోకుండా లుకౌట్ నోటీసులు ఎందుకు జారీ చేసింది? ఈ వ్యవహారంలో వైసీపీ నుంచి వస్తున్న రియాక్షన్ ఏంటి? సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని వైసీపీ ఎందుకు డిమాండ్ చేస్తోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ పాలనలో పట్టిన బూజును దులిపే ప్రయత్నం చేస్తున్నారు. తొలుత ముంబై నటి జత్వానీ కేసు.. ఆ తర్వాత సోషల్ మీడియాలో వల్గర్ పోస్టులు… ఇప్పుడు కాకినాడ పోర్టు ఇష్యూ. ఇలా ఏ వ్యవహారం తెరపైకి వచ్చినా, ప్రతీ అంశం తాడేపల్లి ప్యాలెస్ చుట్టూనే తిరుగున్నట్లు కనిపిస్తోంది. తాడేపల్లి ప్యాలెస్‌లో సీఐడీ అడుగు పెట్టే సాహసం చేస్తుందా? లోగుట్టును అధికారులు విప్పుతారా? అన్నదే ఆసక్తికరంగా మారింది.

 

గడిచిన ఐదేళ్లు సీఐడీని ఓ రేంజ్‌లో వాడేసింది వైసీపీ. ఇక వర్తమానంలోకి వద్దాం.. పోర్టు కబ్జా వ్యవహారం వెలుగులోకి రాగానే సీఐడీ రంగంలోకి దిగేసింది. కేవీ రావు ఫిర్యాదు మేరకు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. తొలుత నిందితులు దేశం విడిచి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది సీఐడీ. మరోవైపు తన పని తాను చేసుకుపోతోంది. రేపో మాపో వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కొందరు న్యాయస్థానం తలుపు తట్టారు.

 

సీఐడీ దర్యాప్తులో కీలక విషయాలు రివీల్ అవుతున్నాయి. సెజ్‌లో వాటాలు దక్కించుకున్న విషయంలో ఆడిట్ కంపెనీ విజయసాయిరెడ్డికి నామినీయేనంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు సమర్పించి 900 కోట్ల రూపాయలు ఎగవేశారంటూ నివేదిక ఇచ్చిందట. ఇప్పుడు ఆ లెక్కలను తేల్చే పనిలో పడింది సీఐడీ. దర్యాప్తు జరుగుతుండగానే కీలక విషయాలు బయటపెట్టింది టీడీపీ.

 

కాకినాడ సెజ్‌లో ఎకరం 29 వేల రూపాయలకు ఎలా దక్కించుకుందని నిలదీశారు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. నాలుగేళ్ల కిందట ఓ కన్సల్టెంట్ నివేదిక ప్రకారం కాకినాడ సెజ్‌లో ఎకరం 50 లక్షలు రూపాయలు. ఆ కన్సల్టెంట్ నివేదిక ఇచ్చిన ఆరు నెలల్లో చేతులు మారాయన్నది టీడీపీ వెర్షన్. అటు వైసీపీ నేతలు సైతం రంగంలోకి దిగేశారు. అధికార పార్టీపై ఎదురుదాడి చేసే ప్రయత్నం చే

శారు.

 

కాకినాడ పోర్టు వ్యవహారం ఇప్పటిది కాదని, 1997 నుంచి జరిగిన వ్యవహారాలపై విచారణ చేపట్టాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాన డిమాండ్. సీబీఐ లేదా ఈడీతో విచారణ జరిపించాలన్నది ఆయన కోరిక. అప్పుడు జరిగినవి.. ప్రజలకు తెలియని కొన్ని విషయాలు బయటపెట్టారు. ఇన్ని విషయాలు తెలిసిన వైసీపీ పాలకులు, గడిచిన ఐదేళ్లలో ఏం చేశారన్నది అధికార పార్టీ నుంచి కౌంటర్లు పడిపోతున్నాయి. ఈ విషయంలో వైసీపీ నీళ్లు మింగుతోంది.

 

కాకినాడ పోర్టు, సెజ్‌ల లోగుట్టుపై తర్జనభర్జన పడుతోందట సీఐడీ. ఎందుకంటే కొన్ని అంశాలు వారికి అర్థం కావడంలేదంటున్నారు. దీనికి సంబంధించి ఈడీ గానీ, కొందరి నిపుణులతో స్పెషల్‌గా టీమ్‌ని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నది కొందరంటున్నారు. గతంలో జగన్ ఆస్తుల కేసును ఈడీ దర్యాప్తు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏమో రేపో మాపో ఈడీ ఇందులోకి దిగినా ఆశ్చర్య పోనక్కర్లేదని అంటున్నారు.