APTELANGANA

ఏపీ, తెలంగాణల్లో కలకలం

అమరావతి: ఏపీ, తెలంగాణల్లో కలకలం చోటు చేసుకుంది. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు రంగంలోకి దిగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సోదాలకు పూనుకున్నారు.

ఈ తెల్లవారు జాము నుంచీ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పలు నివాసాలపై మెరుపు దాడులు చేపట్టాయి.

వామపక్ష తీవ్రవాద భావజాలం ఉన్న వారు ఆయా ప్రాంతాల్లో నివసిస్తోన్నట్లు పక్కా సమాచారం అందడంతో ఎన్ఐఏ అధికారులు ఈ తనిఖీలు చేస్తోన్నారు. ఏపీ, తెలంగాణల్లో ఏకకాలంలో 60 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొన్ని అరెస్టులు ఉండే అవకాశాలు లేకపోలేదనే అంచనాలు ఉన్నాయి.

ఏపీలోని రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో ఈ తెల్లవారు జాము నుంచీ సోదాలను నిర్వహిస్తోన్నారు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు. మంగళగిరి, నవులూరు, దొండపాడు, నేలపాడు, తుళ్లూరు, రాయపూడి, ఐనవోలు.. వంటి గ్రామాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

అటు తెలంగాణలో కూడా విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడలు చేపట్టారు అధికారులు. అల్వాల్‌ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలను చేపట్టారు. అమర బంధుమిత్రుల సంఘం, పౌర హక్కుల సంఘం నేతల ఇళ్లలో దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది.

అమెజాన్ అడవుల్లో రికార్డుస్థాయి టెంపరేచర్: వందకుపైగా డాల్ఫిన్ల మృత్యువాత

నెల్లూరులో ఏపీ సీఎల్‌సీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ఇంట్లోనూ సోదాలు చేసినట్లు చెబుతున్నారు. పౌరహక్కుల ఉద్యమంలో కీలకంగా పని వ్యవహరించిన అన్నపూర్ణ, అనూష నివాసంలో ఎన్ఐఏ దాడులు చేపట్టారు. నెల్లూరు అరుణ, గుంటూరులో డాక్టర్ రాజారావు ఇళ్లలో ఎన్ఐఏ తనిఖీలు జరుగుతున్నాయి.