AP

ప్రథమ్ థింక్ గ్యాస్ స్టేషన్లు ప్రారంభించిన ఏపీ సీఎం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ కోస్టల్ ఏరియా ఉండడం ఓ వరమన్నారు సీఎం చంద్రబాబు నాయడు. ఆ కారణంగానే.. రాష్ట్రంలో గ్యాస్ ఉత్పత్తి భారీ ఎత్తున ఉందని అన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి పెద్దఎత్తున ఉన్నా, వినియోగంలో ఇంకా వెనుకబడి ఉన్నామని అన్నారు. తిరుచానూరు నుంచి రాష్ట్రంలో ఇంటింటికి సహజవాయువు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఆ తర్వాత గ్యాస్ కంపెనీ ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ.. అనేక అంశాల్లో ప్రభుత్వ ఆలోచనల్ని వెల్లడించారు.

 

తొలుత తిరుచానూరుకు చెందిన శరవణ్ అనే లబ్ధిదారుడి ఇంట్లో స్వయంగా టీ పెట్టిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో విస్త్రారమైన సహజ వనరులున్నాయని, వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలి అనుకుంటున్నట్లు తెలిపారు. ప్రథమ్ థింక్ గ్యాస్ సీఎన్జీ వాహనాలను ప్రారంభించారు. రాష్ట్రంలో చాలా తక్కువ వినియోగంలో ఉన్న గ్యాస్ వాడకాన్ని రానున్న రోజుల్లో.. వివిధ పథకాలతో భారీగా పెంచేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలియజేశారు.

 

కాలుష్యరహిత సమాజం కోసం అంతర్జాతీయంగా ఎంతో కృషి జరుగుతుందన్న సీఎం చంద్రబాబు.. తామ ప్రభుత్వం సైతం 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్షంగా పని చేస్తున్నట్లు తెలియజేశారు. భవిష్యత్తులో హైడ్రోజన్ ఉత్పత్తులను.. ఏపీ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని గోదావరి బేసిన్ నుంచే 40 శాతం గ్యాస్ లభిస్తుందని తెలిపారు. ఇంటింటికి గ్యాస్ సరఫరా కోసం గతంలోనే ఆలోచనల చేసినట్లు తెలిపిన సీఎం చంద్రబాబు.. 2014-19 మధ్య కొన్ని ప్రణాళికల్ని రచించినట్లు తెలిపారు. ఇంటింటికి గ్యాస్ కోసం 5 కంపెనీలను సంప్రదించినట్లు వెల్లడించారు. 99 లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపిన సీఎం.. ప్రతీ ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన గ్యాస్ అందిస్తామని హామీ ఇచ్చారు.

 

భవిష్యత్తులో ఏపీ గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్.. ఇతర రాష్ట్రాల్లో కూడా వాడుతున్నారని, క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ దిశగా ప్రపంచం అడుగులు వేస్తోందన్నారు. సోలార్, విండ్ ఎనర్జీని మరింతగా ప్రోత్సహించాల్సిన తరుణం వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఎల్పీజీ, సీఎన్జీ ద్వారా వినియోగదారులు పెద్ద ఎత్తున లాభపడతారన్న చంద్రబాబు.. శిలాజ ఇంధనాల కంటే ఈ సహజ వాయువు ఇంధనాలే 20, 30 శాతం తక్కువ ఖర్చవుతున్నాయని, తద్వారా ఆ మేరకు లాభాలు వస్తున్నాయని వినియోగదారులు చెబుతున్నారని ఏపీ సీఎం అన్నారు.

 

కూటమి ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూలంగా పనిచేస్తుందని.. పారిశ్రామిక వేత్తలకు హామి ఇచ్చారు. పెట్టుబడులు పెట్టడం కారణంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని.. వాటి ద్వారా ప్రభుత్వానికి తిరిగి ఆదాయం లభిస్తుందన్నారు. అందుకే.. ఓవైపు పరిశ్రమల అభివృద్ధితో పాటు సమాజాభివృద్ధికి పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు ఎంతో ముఖ్యమన్నారు. ఇప్పటి తరం గ్రీన్ ఎనర్జీ గురించి మాత్రమే కాదని.. గ్రీన్ ఫుడ్ గురించి కూడా ఆలోచించాలని సూచించారు. పురుగు మందుల వినియోగానికి దూరంగా, సహజ ఎరువుల వినియోగంతో పంటలు పండించే రోజుకు రావాలని ఆశించారు.