AP

కేడర్‌కు పవన్ ఓపెన్ లెటర్..

ఏపీలో వైసీపీ తన ప్లాన్ అమలు చేస్తోందా? కూటమి మధ్య విభేదాలకు వైసీపీ శ్రీకారం చుట్టిందా? జనసేన కేడర్‌ను వైసీపీ రెచ్చగొట్టే ప్రయత్నంలో పడిందా? ఎందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్యకర్తలకు ఓపెన్ లెటర్ రాశారు? పార్టీలో పరిణామాలు అటువైపు దారితీస్తున్నాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది కూడా పూర్తి కాలేదు. వైసీపీ తన పనిలో నిమగ్న మైంది. ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటోంది. సోషల్ మీడియా ద్వారా నేరుగా ప్రభుత్వంపై దాడి చేయకుండా కూటమిలో చీలిక తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ కార్యకర్తలు.. జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతోంది. దీంతో జనసైనికులు ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నారు. కొద్దిరోజులు ఈ తతంగం నడుస్తోంది.

 

జనసేన హైకమాండ్‌కు దీనిపై సంకేతాలు వెళ్లాయి. దీంతో రంగంలోకి దిగేశారు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ క్రమంలో కేడర్‌కు ఓపెన్ లెటర్ రాశారా యన. కూటమి అంతర్గత విషయాల్లో ప్రతిస్పందించొద్దన్నది ప్రధాన పాయింట్. అనవ సర వివాదాలు, విభేదాల జోలికి వెళ్లొద్దన్నది మరో సూచన. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలపై సెలెంట్‌గా ఉండాలని ప్రస్తావించారు.

 

అలాగే వ్యక్తిగత విషయాలు వెల్లడించి, బహిరంగంగా చర్చించొద్దని శ్రేణులకు పిలుపు ఇచ్చారు. తాను పదవుల కోసం ఏనాడూ రాజకీయం చేయలేదు.. భవిష్యత్ చేయనని మనసులోని మాట బయట పెట్టారు. పుట్టిన నేలను అభివృద్ధి చేయడం మాత్రమే తనకు తెలుసన్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని రిక్వెస్ట్ చేశారు.

 

అలాగే మార్చి సెకండ్ వీక్‌ జనసేన పార్టీ ఆవిర్భావం రోజు భవిష్యత్ లక్ష్యాలు గురించి చర్చించుకుందామని రాసుకొచ్చారు. గడిచిన ఐదేళ్ల వైసీపీలో ప్రజలు విసిగిపోయారని, మొన్నటి ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించిందన్నారు. ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని ఎన్నుకున్నారని గుర్తు చేశారు.

 

అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన నాయకులు కలిసి రావడంతో కూటమికి 164 సీట్లు ఇచ్చిన విషయాన్ని ప్రధానంగా గుర్తు చేశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

 

రీసెంట్‌గా దావోస్ టూర్‌కు సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, టీజీ భరత్‌లతోపాటు కొందరు అధికారులు వెళ్లారు. డిప్యూటీ సీఎం పవన్‌ ఆ టూర్‌కు దూరంగా ఉన్నారు. అప్ కోర్స్.. వ్యక్తిగత కారణాలా, మరేదైనా కావచ్చు. దీనిపై ప్రత్యర్థుల నుంచి జనసేన కేడర్‌ను టార్గెట్ చేస్తూ పోస్టులు చక్కర్లు కొట్టాయి. ఈ వ్యవహారం సోషల్ మీడియా రచ్చయ్యింది. ఈ క్రమంలో పవన్ ఓపెన్ లెటర్ రాశారని అంటున్నారు.