వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా కుమార్తె సునీత మరోసారి హై కోర్టు లో పిటీషన్ దాఖలు చేసారు. తాజా పిటీషన్ లో కీలక అంశాలు ప్రస్తావించారు. కేసు విచారణలో జాప్యం పైన హైకోర్టుకు వివరించారు. కేసు విచారణ వేళ చోటు చేసుకుంటున్న పరిణామాలను తన పిటీషన్ లో పేర్కొన్నారు. సీబీఐ కోర్టులో కేసు విచారణ ఆరు నెలల సమయంలో పూర్తయ్యేలా
ఆదేశాలు ఇవ్వాలని సునీత అభ్యర్ధించారు.
తెలంగాణ హైకోర్టులో వివేకా కుమార్తె సునీతారెడ్డి మరో పిటిషన్ దాఖలు చేసారు. వివేకా హత్య కేసు విచారణ తీవ్ర జాప్యం జరుగుతోందని కోర్టుకు నివేదించారు. ఈ పిటిషన్‌లో సీబీఐతో పాటు నింది తులు గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి,షేక్ దస్తగిరి (అప్రూవర్), శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఎంపీ అవినాశ్‌రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై విచారణ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయి రెండేళ్లు దాటినా ఇంకా సీఆర్పీసీ 207 దశలోనే ఉందని పేర్కొన్నారు.
దీనికి కొనసాగింపుగా సీబీఐ ఇచ్చిన హార్డ్ డిస్క్ ల్లో 13 లక్షల ఫైల్స్ ఉన్నాయని.. కాగా, ఇప్పటి దాకా 13,717 ఫైల్స్ మాత్రమే ఓపెన్ చేసారని కోర్టుకు వివరించారు. ఇలాగే కొనసాగితే ఏడేళ్లు అయినా విచారణ ప్రారంభం కాదని చెప్పుకొచ్చారు.
ఈ కేసులో సాక్షి వైఎస్ అభిషేక్‌రెడ్డి మరణించి న అంశాన్ని కోర్టుకు తెలిపారు. నిందితులందరికీ నోటీసులు జారీచేయాలని కోరారు. దీంతో, వాదనలు విన్న తరువాత ధర్మాసనం.. నిందితులకు నోటీసులిస్తే ఏం లాభం.. మేం ట్రయల్‌కు సహకరిస్తున్నామని చెబుతారని పేర్కొంది. దీంతో, ఈ పిటీషన్ పైన తుదపరి విచారణ ను ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.