శుక్రవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో విశాఖ రైల్వే జోన్‌కు ఆమోదం లభించింది. విశాఖ రైల్వే జోన్ పరిధికి ఆమోదం తెలుపుతూ, విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు వాల్తేర్ డివిజన్‌గా ఉన్న దానిని విశాఖపట్నం రైల్వే డివిజన్‌గా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
దీంతో విభజన చట్టంలో ఉన్న ఒక ప్రధాన హామీ నెరవేరినట్లయింది. నూతనంగా రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసి, దానిని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి తీసుకురానున్నారు. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు.
స్కిల్ ఇండియా కోసం రూ.8,800 కోట్లు, పీఎం కౌశల్ వికాస్ యోజన 4.0కి రూ.6 వేల కోట్లు, జన్ శిక్షణ్ సంస్థాన్‌కు రూ.858 కోట్లు విడుదల చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్‌కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరినట్లయింది.