AP

నేడు జగనన్న అమ్మ ఒడి నిధులు విడుదల

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పర్యటించనున్నారు. అమ్మ ఒడి పథకం నిధులను బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

కురుపాం పర్యటన కోసం ఈ రోజు ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరారు సీఎం జగన్‌. 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్‌ కాలేజ్‌ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కురుపాంలోని బహిరంగ సభ వేదిక వద్దకు రోడ్డు మార్గంలో వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయల్దేరి తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.

వరుసగా నాలుగో ఏడాదీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘జగనన్న అమ్మ ఒడి’ అమలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు. 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నారు. తాజాగా విడుదల చేయబోయే నిధులతో కలిపి.. ఇప్పటి వరకు జగనన్న అమ్మఒడి ద్వారా రూ. 26,067.28 కోట్ల మేర ప్రయోజనాన్ని లబ్ధిదారులకు చేకూర్చినట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది​. నవరత్నాల అమల్లో భాగంగా ఏటా అమ్మ ఒడి నిధులను విడుదల చేస్తున్నారు. విద్యార్ధులకు 75 శాతం హాజరు ఉండి తీరాలి. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా 43,96,402 మంది తల్లులు అర్హులుగా ఉన్నారు.