AP

జనసేన పరిస్థితి ఇంత హీనమా, దేహీ అనటం పొత్తు ధర్మమా – జోగయ్య..!..

టీడీపీ, జనసేన అభ్యర్దుల ప్రకటనతో కొత్త రాజకీయం మొదలైంది. జనసేన 24 సీట్లకు పరిమితం కావటం ఆ పార్టీ శ్రేణులకు..మద్దతు దారులకు రుచించటం లేదు. సీట్ల దక్కని జనసేన ఆశావాహులు నైరాశ్యం లో ఉన్నారు. మరి కొందరు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో చేగొండి హరిరామ జోగయ్య జనసేనాని పవన్ కు లేఖ రాసారు. కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సీట్ల ఒప్పందం కూడా పవన్ సమర్ధించుకుంటారా అని ప్రశ్నించారు.

 

జోగయ్య లేఖ: టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలను చంద్రబాబు కేటాయించారు. దీని పైన జనసేన ముఖ్యనేతలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేటాయించిన 24 సీట్లలో పవన్ కేవలం అయిదు స్థానాలకే అభ్యర్దులను ప్రకటించారు. తాను పోటీ చేసే స్థానం పైనా స్పష్టత ఇవ్వలేదు. ఇటు జనసైనికుల నుంచి సీట్ల ఒప్పందం పైన నిరాశ వ్యక్తం అవుతోంది.

 

తాజాగా హరి రామజోగయ్య ఈ సీట్ల ఒప్పందం పైన లేఖ రాసారు. కేవలం 24 సీట్లకు పరిమితం కావటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒకరు ఇవ్వడం మరోకరు దేహీ అనడం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా అంటూ నిలదీసారు. జనసేన కు 24 సీట్లకు మించి నెగ్గగలిగే స్తోమత లేదా అంటూ ఫైర్ అయ్యారు.

 

ఇదేనా పొత్తు ధర్మం: జనంలో జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా అంటూ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పవన్ చెప్పగలరా అని జోగయ్య నిలదీసారు. సీట్ల పంపకం మిత్రపక్షాల మద్య ఏ ప్రాతిపదికన చేసారని ప్రశ్నించారు. అన్నికులాల జనాభా ప్రాతిపధికన జరిగాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

 

జనసైనికులు సంతృప్తి చెందే విధంగా సీట్లు పంపకం ఉందా చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ తరహాలో నిర్ణయాలు పొత్తు ధర్మం అనిపించుకుంటుందా అంటూ దుయ్యబట్టారు. జనసైనికులకు కావాల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదు.. పవన్ కు అధికారమని జోగయ్య స్పష్టం చేసారు. ప్రస్తుత సంక్షోభానికి ఒకటే మాత్ర అని జోగయ్య పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ చెరో రెండున్నారేళ్లు సీఎం పదవి.. రెండు పార్టీల నుంచి మంత్రి పదవుల పైన సమాన వాటా ఉండాలని చెప్పుకొచ్చారు .

 

ఒక్కటే పరిష్కారం: ఈ మేరకు చంద్రబాబు స్వయంగా ప్రకటన చేయాలని జోగయ్య లేఖ ద్వారా డిమాండ్ చేసారు. గతంలో సీట్ల విషయంలోనూ జోగయ్య పలు లేఖలు రాసారు. అయితే పవన్ 24 సీట్లకు అంగీకరించటం ఇప్పుడు అభిమానులకు నచ్చటం లేదు.

 

పవన్ మాత్రం పోటీ చేస్తున్న సీట్లలో స్ట్రైకింగ్ రేట్ బాగుండాలని చెప్పుకొస్తున్నారు. దీంతో..సీట్ల విషయంలో పార్టీలో వస్తున్న స్పందన పైన పవన్ ఏ రకంగా రియాక్ట్ అవుతారు..ఎలా ఎన్నికలకు సంసిద్దులను చేస్తారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.