ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైన విషయం విదితమే. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ దఫా అసెంబ్లీ సమావేశాలను కనీసం 20 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, ఈసారి అసెంబ్లీకి నూతనంగా ఎన్నికైన సభ్యుల సంఖ్య అధికంగా ఉండటంతో వీరికి అవగాహన తరగతులను నిర్వహించాలని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నిర్ణయించారు.
అసెంబ్లీ సమావేశాలకు ముందుగా ఈ నెల 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు అసెంబ్లీలోని కమిటీ హాలులో ఈ శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, సభ్యుల విధులు, సభలో సభ్యులు నడుచుకోవలసిన తీరు తదితర అంశాలపై సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ శిక్షణా తరగతుల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఆహ్వానించనున్నారు. రెండో రోజు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా శిక్షణా తరగతులకు విచ్చేసి కొత్తగా ఎన్నికైన సభ్యులకు విలువైన సూచనలు, సలహాలు అందించనున్నారు.
కాగా, 24వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు సమావేశాలను నిర్వహించాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటారు.