:రానున్న బిషప్ సమావేశాల్లో మహిళలకు ఓటు హక్కును కల్పించాలని పోప్ ఫ్రాన్సిస్ నిర్ణయించారు. మహిళలకు సమాన హక్కులు కల్పించాలనే భావనతో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ఈ మేరకు వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఓటు హక్కుకల్పించడం ద్వారా సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో వారు కీలక పాత్ర పోషిస్తారని పోప్ ఫ్రాన్సిస్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు మహిళలకు మరింత నిర్ణయాధికార బాధ్యతలు అప్పజెప్పాలని ఆయన డిసైడ్ అయ్యారు. సైనాడ్ ఆఫ్ బిషప్స్‌కు వర్తించే పాలనాపరమైన నిబంధనల్లో చేసిన మార్పులకు పోప్ ఫ్రాన్సిస్ ఆమోదముద్ర వేశారు. ప్రపంచ దేశాల్లోని బిషప్‌లంతా వాటికన్ సిటీలో పలు సమావేశాలకు హాజరవుతారు. ఆ సమయంలో ఈ కొత్త మార్పులకు అధికారిక ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోప్ ఫ్రాన్సిస్ ఏ అంశాలకైతే ఆమోదం తెలిపారో ఆ అంశాలకు సంబంధించిన జాబితాను వాటికన్ విడుదల చేసింది.
ఇందులో భాగంగా మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించడం ద్వారా వారి బాధ్యతలను పెంచేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతకుముందు వాటికన్ చర్చిలో కేవలం పాస్టర్లు, బిషప్‌లు, ఇతర కార్డినల్స్‌కు మాత్రమే అధికారం ఉండేది. తమకు కూడా సైనాడ్ ఆఫ్ బిషప్స్ సమావేశంలో ఓటు వేసేందుకు అనుమతించాలంటూ కొన్ని దశాబ్దాలుగా మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి డిమాండ్లను పట్టించుకున్న నాథుడు లేడు. తాజాగా పోప్ ఫ్రాన్సిస్ తీసుకున్న ఈ నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది అక్టోబరులో బిషప్స్ సమావేశం వాటికన్‌లో జరుగుతుంది. 1960లో జరిగిన రెండవ వాటికన్ సమాఖ్య తర్వాత చర్చిని ఆధునీకీకరించారు. ఆ తర్వాత పలు అంశాలపై చర్చించేందుకు కొన్ని వారాల పాటు ప్రపంచ దేశాల్లోని బిషప్స్‌ను రోమ్‌కు పిలిపించి చర్చలు జరిపేవారు. సమావేశం తర్వాత కొన్ని ప్రతిపాదనలపై బిషప్‌లు ఓటు వేయడం జరుగుతుంది. ఓటింగ్ తర్వాత ఆ ప్రతిపాదనలను పోప్ ముందు ఉంచుతారు. వీటిని పరిశీలించిన మీదట పోప్ తన అభిప్రాయం వెల్లడిస్తారు. ఇప్పటి వరకు ఓటింగ్‌లో కేవలం పురుషులు మాత్రమే పాల్గొనేవారు. అయితే తాజా మార్పులతో ఐదుగురు సిస్టర్లు మరో ఐదుగురు పాస్టర్లతో కలిసి ఓటింగ్ ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. మహిళలకు ఓటు హక్కు కల్పించాలన్న పోప్ ఫ్రాన్సిస్ తాజా నిర్ణయంతో అదనంగా 70 మంది నాన్ బిషప్ సభ్యులు ఉంటారు. వీరిలో సగం మంది మహిళలు ఉంటారు. వారికి ఓటు హక్కు ఉంటుంది.