AP

ఉత్తరాంధ్రకు వైసీపీ కొత్త బాస్..? ఎవరంటే..?

జగన్ నిర్ణయాలకు ఆ పార్టీ నేతలు షాకవుతున్నారా? నేతలు ఒకటి తలిస్తే.. అధినేత మరొకటి చేస్తున్నారా? ఉత్తరాంధ్రకు కొత్త బాస్‌ కన్నబాబు పేరు ప్రకటించడం ఏం జరిగింది? అధినేతపై ఎందుకు ఉత్తరాంధ్ర నేతలు గుర్రుగా ఉన్నారా? జగన్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

 

వైసీపీలో ఏం జరుగుతోంది?

 

ఏపీలో అధికార పోయినా మాజీ సీఎం జగన్ తీరు మారలేదా? అధినేతపై కొందరు ఉత్తరాంధ్ర జిల్లాల నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారా? ప్రజల్లోకి వెళ్లే ముందు కొత్త టీమ్‌ను తయారు చేసుకుంటున్నారు వైసీపీ అధినేత జగన్. ఉగాది తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇందులోభాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్, జిల్లాల అధ్యక్షుడు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులను నియమిస్తున్నారు.

 

రేసులో చాలామంది

 

వైసీపీకి, ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి ఇటీవల రాజీనామా చేశారు. వైసీపీలో ఆ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై రకరకాల వార్తలు జోరందుకున్నాయి. దగ్గరవాళ్లకే జగన్ ఆ పదవిని అప్పగిస్తారని కొందరన్నారు. ఈసారి కచ్చితంగా ఉత్తరాంధ్ర వైసీపీ నేతలకే ఆ పదవి దక్కుతుందని చాలామంది గంపెడంత ఆశలు పెట్టుకున్నారు. రేసులో చాలామంది పేర్లు వినిపించాయి. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడవాడ అమర్ నాథ్ వంటి నేతల పేర్లు వినిపించాయి.

 

బుధవారం రాత్రి మాజీ మంత్రి కురసాల కన్నబాబును ఉత్తరాంధ్ర జిల్లాల కో-ఆర్డినేటర్‌గా జగన్ నియమించారు. ఈ వ్యవహారం ఉత్తరాంధ్ర వైసీపీలో ములసం మొదలైనట్టు కనిపిస్తోంది. కన్నబాబును నియమించిన విషయం తెలియగానే కొందరు నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్ సమాచారం.

 

వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యవహరించారు మాజీ మంత్రి కన్నబాబు. గడిచిన ఎనిమిదినెలల్లో కేవలం ఒక్కటీ లేదా రెండు సార్లు మాత్రమే ఆయన మీడియా ముందుకొచ్చినట్లు నేతలు చెబుతున్నారు. అయినా సరే కన్నబాబును ఏరి కోరి ఉత్తరాంధ్రకు ఇన్‌ఛార్జ్‌ను చేయడం అక్కడి నేతలకు మింగుడు పడడం లేదు.

 

కన్నబాబు టార్గెట్ ఏంటి?

 

వచ్చే ఎన్నికల్లో కాకినాడ కాకుండా విశాఖ సిటీలో పెందుర్తి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని అధిష్టానం చెవిలో వేశారట కన్నబాబు. తనకు పెందుర్తి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ కావాలని పట్టుబట్టారట. లేదంటే తనకు ఎలాంటి ఇన్‌ఛార్జ్ పదవి వద్దని తెగేసి చెప్పినట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఆ ప్రాంతంలో ఉన్నారట. దీనిపై వైసీపీ హైకమాండ్ సైలెంట్ అయిపోయినట్టు పార్టీ వర్గాల మాట.

 

ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రీజినల్ కో-ఆర్డినేటర్ పదవికి ఎక్కువమంది రేసులో ఉండడంతో కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చారు మాజీ సీఎం. దీంతోనైనా నాయకుల మధ్య సఖ్యత ఉంటుందని భావిస్తోంది ఆ పార్టీ. వైసీపీ రూలింగ్ లో ఉండగా విశాఖకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా కన్నబాబు వ్యవహరించారని అంటున్నాయి. ఈ క్రమంలో ఆయనకు ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ పదవి ఇచ్చారని చెబుతున్నారు కొందరు.

 

కొత్తగా వచ్చిన ఉత్తరాంధ్ర వైసీపీ బాస్‌ కన్నబాబుకు అక్కడి నేతలు సహకరిస్తారా? అన్నదే అసలు పాయింట్. ఇన్ ఛార్జుల వ్యవహరం వైసీపీలో మొదలైన ముసలం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి. మొత్తానికి ఉత్తరాంధ్ర రాజకీయాలకు ఈ విధంగా జగన్ ఫుల్‌స్టాప్ పెట్టేరని చెప్పవచ్చు.