AP

టీడీపీకి బిగ్ షాక్.. గుడ్ బై చెప్పిన జీవీ రెడ్డి..

ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తులో తాను ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదంటూ కూడా జీవీ రెడ్డి విడుదల చేసిన ప్రకటన ద్వారా వెల్లడించడం విశేషం.

 

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి జీవీ రెడ్డికి ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. దీనితో ఏపీ ఫైబర్ నెట్ కు సంబంధించి వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ జీవి రెడ్డి పలుమార్లు సంచలన ఆరోపణలు చేశారు. అలాగే ఫైబర్ నెట్ లో సుమారు 400 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. వైసీపీ కార్యకర్తలకు ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగాలు కల్పించారని పలుమార్లు జీవి రెడ్డి ఆరోపించారు. ఈ దశలో ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ కు చైర్మన్ జీవి రెడ్డికి పలు విషయాలలో విభేదాలు వచ్చినట్లు సమాచారం. ఈ కారణంగానే జీవి రెడ్డి గత కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

 

కాగా సోమవారం కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్ ను జీవి రెడ్డి ఇచ్చారని చెప్పవచ్చు. వ్యక్తిగత కారణాలతో తాను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదాకు, అలాగే ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుండి తప్పుకుంటున్నట్లు జీవీ రెడ్డి ప్రకటించారు. తనపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు, తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని జీవీ రెడ్డి తన రాజీనామా ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఇకపై తాను పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని, భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదంటూ జీవి రెడ్డి తేల్చి చెప్పారు.

 

మొత్తం మీద జీవి రెడ్డి రాజీనామా ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. జీవి రెడ్డిని బుజ్జగించి మళ్లీ పార్టీలో కొనసాగేలా చేస్తారా లేదా అన్నది మున్ముందు తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఏపీ ఫైబర్ నెట్ అంశం చివరకు చైర్మన్ పదవి రాజీనామాకు దారి తీసిందని చెప్పవచ్చు. ప్రకాశం జిల్లా మార్కాపురంకు చెందిన జీవి రెడ్డి న్యాయవాద వృత్తిలో ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించారు.

 

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పలు మీడియా డిబేట్ లలో పాల్గొని టీడీపీ వాణి వినిపించారు. అలాగే ఎన్నికల సమయంలో కూడా పార్టీ గెలుపుకు ఈయన విస్తృత ప్రచారం చేశారు. పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన జీవీ రెడ్డికి సముచిత స్థానం కల్పించేందుకు సీఎం చంద్రబాబు ఏకంగా ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గా నియమించారు. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఛైర్మన్ పదవితో పాటు, పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.