ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులు ఇకపై ఎంపీసీ, బైపీసీ వంటి గ్రూపులతో పాటు ఎం బైపీసీ చదువుకునే వెసులుబాటు కల్పించింది. ఇంటర్మీడియట్ విద్యా మండలితో మంత్రి లోకేశ్ అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది. 2025-26 సంవత్సరం నుంచి ఇంటర్ విద్యలో తీసుకురానున్న సంస్కరణలకు ఆమోదం తెలిపింది. విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంచేలా కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలో ఏపీ ఇంటర్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత బోర్డులో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 77వ సమావేశం అసెంబ్లీలోని మంత్రి లోకేష్ పేషీలో జరిగింది. ఇంటర్ విద్య గురించి అధికారుల నుంచి పూర్తి వివరాలు తీసుకున్నారు.
ఆ తర్వాత నాణ్యత ప్రమాణాలను పెంచి విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కాలేజీల వైపు ఆకర్షించేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు తయారు చేసేందుకు 2025-26 విద్య సంవత్సరం క్యాలెండర్‌లో మార్పులు చేపట్టారు.
గతంలో ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రద్దు చేయాలనే ప్రతిపాదనను విద్యా మండలి నిలిపి వేసింది. ప్రతిపాదనలపై వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్‌లో ఎం బైపీసీ గ్రూపు వల్ల విద్యార్థులు మెడికల్, ఇంజినీరింగ్ రెండింటికి అర్హత సాధిస్తారు. నీట్, జేఈఈలు రెండింటినీ రాసుకోవచ్చు.
నీట్, జేఈఈ రాయవచ్చు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి సిలబస్‌ను అమలు చేయనున్నారు. విద్యార్థులు ఆరు సబ్జెక్టులతో ఎంబైపీసీ కోర్సు చదువుకునే అవకాశం కల్పించారు. మారిన సిలబస్ ప్రకారం కొత్త పుస్తకాలను ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇవ్వనుంది ప్రభుత్వం.
విద్యార్థులు ఇకపై ఆరు సబ్జెక్టులతో ఎంబైపీసీ చదువుకునే అవకాశం కల్పించారు. గ్రూపులో ఐదు సబ్జెక్టులు ఉండనున్నాయి. రెండు భాష సబ్జెక్టుల్లో ఇంగ్లీష్ తప్పనిసరి. రెండో భాష సబ్జెక్టు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ స్థానంలో జీవశాస్త్రం తీసుకుంటే ఎంబైపీసీ చదవొచ్చు. లేదంటే విద్యార్థులు నచ్చిన సబ్జెక్టును ఎంపిక చేసుకునే అవకాశం కల్పించింది. భాషలు లేదా సైన్స్, హ్యుమానిటీస్ విభాగాల్లో 24 సబ్జెక్టుల్లో దేనినైనా చదువుకోవచ్చు.
ప్రస్తుతం మేథమెటిక్స్‌లో ఏ, బీగా రెండు పేపర్లు 150 మార్కులుగా ఉండేవి. వచ్చే ఏడాది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌కు 100 మార్కులకే పేపర్ ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాలు ప్రస్తుతం 60 మార్కులకు ఉంది. దీన్ని 85 మార్కులకు పెరుగుతాయి. మిగతా 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. సెకండ్ ఇయర్‌లో 30 మార్కులకు ప్రాక్టీకల్స్ ఉంటాయి.
సబ్జెక్టుల్లో మార్పులు
వృక్ష, జంతు శాస్త్రం కలిపి జీవశాస్త్రం ఒకే సబ్జెక్టుగా ఉంటుంది. ఇది 85 మార్కులకు ఉంటుంది. అందులో 43మార్కులు వృక్షశాస్త్రం, 42 మార్కులు జంతుశాస్త్రం ఉండబోతోంది. మిగతా 15 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. లాంగ్వేజ్ సబ్జెక్టుకు 100 మార్కులకు ఉంటాయి. కాంపిటేటివ్ బేస్డ్ ఎసెస్‌మెంట్ కోసం ఇంటర్మీడిటయట్, సైన్స్, హ్యూమనిటీస్ విభాగాల ప్రశ్నల్లో 10 శాతం తప్పనిసరిగా MCQలు ఉండనున్నాయి. ఖాళీలు పూరించే రూపంలో ప్రశ్నకు ఒక మార్కు ఉండేలా కొశ్చన్ పేపర్ రూపొందించనున్నారు.
వృత్తి విద్యా కోర్సుల్లో డ్యుయల్ సర్టిఫికెట్ పద్దతి ఉండనుంది. జాతీయ నైపుణ్య కౌన్సిల్ సర్టిఫికెట్, మరొకటి ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వనున్నాయి. మరో అంశం ఏంటంటే.. వృత్తి విద్య కోర్సుల కోసం కళాశాలలు స్థానిక పరిశ్రమలతో అనుసంధానం కావాల్సి ఉంటుంది.
2025-26 విద్యా సంవత్సరం నుంచి జూన్ ఒకటి బదులు ఏప్రిల్ ఒకటి నుంచి జూనియర్ కళాశాలలు మొదలుకానున్నాయి. ఫస్ట్ ఇయర్ ప్రవేశాల ప్రక్రియ ఏప్రిల్ ఏడు నుంచి మొదలవుతుంది. ఇక నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ను బోర్డుకు సంబంధించిన పోర్టల్‌లో ఉంచుతారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడంతోపాటు మెటీరియల్‌ను ఉచితంగా ఇవ్వనుంది ప్రభుత్వం. దీనికితోడు 1973-2003 వరకు ఉన్న సర్టిఫికెట్లను డిజిటలైజేషన్ చేయనుంది ప్రభుత్వం.