ఎట్టకేలకు విశాఖలో లులూ మాల్‌కు లైన్ క్లియర్ అయ్యింది. దీనికి సంబంధించి ఆ గ్రూప్ ముందుకు రావడం, వెంటనే చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయింది. ఆపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపో మాపో మాల్‌కు శంకుస్థాపన జరగనుంది. ఎందుకు లులూ మాల్ విషయంలో డిలే అవుటోంది? అన్నదే అసలు చర్చ.
అసలు ఏం జరిగింది?
2018లో టీడీపీ సర్కార్ లులూ గ్రూపుకు విశాఖలో స్థలం కేటాయించింది. మాల్ తోపాటు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కోసం దాదాపు 14 ఎకరాల హార్బర్ భూములు కేటాయించింది. ఈలోగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక లులూ గ్రూప్ తో ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ భూములను వెనక్కి తీసుకుంది. విలువైన భూములు అమ్మి నిధులు రాబట్టాలని జగన్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. గజాల లెక్కన విక్రయిస్తామని ప్రకటన చేసింది.
ఇంతవరకు బాగానే ఉంది. అయితే వాటిని కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు.ఈలోగా మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ద్వారా ఆయా భూములను వేలం వేయాలని ప్రయత్నాలు చేసింది. ఈ వ్యవహారంపై విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే రామకృష్ణబాబు న్యాయస్థానం తలుపుతట్టారు. ఆయా భూములు విక్రయించవద్దని స్టే ఇచ్చింది.
ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం ఆ భూములు వీఎంఆర్‌డీఏకు బదలాయించింది. ఆ సంస్థతో వేలం వేయాలని ప్లాన్ చేసింది. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఆ భూములు ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ వద్ద ఉన్నాయి. వాటిని తిరిగి ఏపీఐఐసీకి వెనక్కి ఇవ్వాలని తాజా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రాజెక్టు విలువ రెండు వేల కోట్లు
హార్బర్ పార్కు ప్రాంతంలో ఏపీఐఐసీ చెందిన 10.85 ఎకరాలు, సీఎంఆర్ గ్రూపునకు చెందిన 3.4 ఎకరాలు కలిపి లులూ గ్రూపుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం కేటాయించింది. రూ.2,200 కోట్ల పెట్టుబడితో భారీ కన్వెన్షన్ సెంటర్, అతి పెద్ద షాపింగ్ మాల్, 5 స్టార్ హోటళ్లు నిర్మిస్తామని ప్రకటించింది. దీనివల్ల ప్రత్యక్షంగా ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందని అప్పట్లో అంచనా వేసింది.
సీఎంఆర్ గ్రూపునకు ప్రత్యామ్నాయంగా సిటీలో పలుచోట్ల 4.85 ఎకరాలు అందజేసింది. అయితే లులూ గ్రూప్ ప్రభుత్వాన్ని కొన్ని మినహాయిపులు కోరింది. మాల్ ఏర్పాటు కోసం కేటాయించే భూముల్ని 99 ఏళ్లకు లీజుకు ఇవ్వాలన్నది తొలి ప్రాతిపదిన. మూడేళ్లు లేదా షాపింగ్ మాల్‌ను ప్రారంభించే వరకు అద్దె మినహాయింపు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి 10 శాతం చొప్పున అద్దె పెంపును ప్రతిపాదించిన విషయం తెల్సిందే.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జనవరిలో లులూ గ్రూప్ అధినేత సీఎం చంద్రబాబుతో అమరావతిలో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంకేతాలు ఇచ్చింది ఆ గ్రూపు. ఈ మేరకు విశాఖలో లులూ గ్రూపుకు స్థలం కేటాయించింది ప్రభుత్వం.
కేవలం విశాఖ మాత్రమే కాకుండా మరో రెండు చోట్ల మాల్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది ఆ గ్రూప్. విజయవాడ లేదా అమరావతి, తిరుపతిలో మాల్స్ ప్రారంభించాలన్నది ఆ కంపెనీ ఆలోచన. మొత్తానికి ఏపీలో లులూ గ్రూప్ ఆ విధంగా అడుగుపెడుతోంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే మే లోపు శంకుస్థాపన చేయాలన్నది ఆ గ్రూప్ ఆలోచన.