AP

ఏపీలో విపక్ష కూటమికి ఈసీ భారీ ఊరట-కీలక ఆదేశాలు జారీ..!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య ప్రతీ విషయంలోనూ పోటాపోటీ వ్యవహారాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్దాయిలో అన్ని పార్టీలకు ఎన్నికల్లో పోటీ, ప్రచారం, ఇతరత్రా అంశాల్లో సమాన అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సంఘం పదే పదే చెబుతోంది. అయినా చాలా సార్లు ఈ మాటలు అమలు కావడం లేదు. కానీ ఇవాళ ఏపీలో మాత్రం ఎన్నికల సంఘం ఓ కీలక అంశంలో మాత్రం విపక్షాలకు ఊరటనిచ్చేలా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

 

ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, వాణిజ్య స్ధలాల్లో రాజకీయ హోర్డింగ్ లను అనుమతించరాదని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే రోడ్ల పక్కనున్న హోర్డింగ్ లను మాత్రం అన్ని రాజకీయ పార్టీలకు సమానంగా కేటాయించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకూ అధికార పార్టీకి అనుకూలంగా హోర్డింగ్ లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్న మున్సిపల్, రెవెన్యూ అధికారులు, పోలీసులు ఇప్పుడు ఈసీ ఆదేశాలతో విపక్షాలకు కూడా తప్పనిసరిగా సమాన అవకాశం కల్పించాల్సి ఉంటుంది.

 

ప్రస్తుతం జాతీయ, ప్రధాన రహదారుల ప్రక్కనున్న హోర్డింగులను అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతిపదికన కేటాయించాలని సీఈవో ముకేష్ కుమార్ మీనా అధికారుల్ని ఆదేశించారు. కొత్త హోర్డింగులకు మాత్రం ఎలాంటి అనుమతులు ఇవ్వద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు తీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

 

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోనున్న నేపథ్యంలో రాజకీయ ప్రకటనలు, పోస్టర్లు, హోర్డింగులు, బ్యానర్ల ప్రదర్శన విషయంలో జిల్లా ఎన్నికల అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్దంగా ఎటు వంటి రాజకీయ ప్రచారాన్ని అనుమతించవద్దని సూచించారు. ప్రైవేటు భవనాలపై వాల్ పెయింట్స్ కు ఎటు వంటి అనుమతిలేదని, ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపేయాలన్నారు. ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు భవనాలపై ఇప్పటికే ఉన్న పెద్ద హోర్డింగులు, కటౌట్ల భద్రతను, నిర్మాణ స్థిరత్వాన్ని ఒక సారి పరిశీలించాలని, స్ట్రక్చర్ లో ఏమాత్రం దృడత్వం లేకపోయినా ప్రకటనలకు అనుమతించ వద్దన్నారు.

 

సరిహద్దు రాష్ట్రాల నుండి మద్యం, ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో శాశ్వత చెక్ పోస్టులు ఉన్న చోట వెబ్ కాస్టింగ్ ద్వారా నిఘా పెంచాలన్నారు. రాజయ పార్టీలు ఉద్యోగులకు, ఓటర్లకు నగదు, బహుమతులు వంటి తాయిలాల పంపిణీని తీవ్రంగా పరిగణించాలన్నారు. సి-విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను నిర్ణీత సమయంలో వందశాతం పరిష్కరించాలని ఆదేశించారు.