AP

ఏపీలో పెన్షన్లు ఇళ్లకే పంపండి-ఈసీకి చంద్రబాబు లేఖ..!

ఏపీలో పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరం పెట్టాలన్న ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించింది. నిన్న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సీఎస్ జవహర్ రెడ్డి.. రాత్రికి క్లారిటీ ఇస్తామని చెప్పినా ప్రకటనేదీ రాలేదు. దీంతో రేపు పెన్షన్ల పంపిణీ ఉంటుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు పెన్షన్ల పంపిణీని సచివాలయ సిబ్బందితో చేయించాలని కోరుతూ ఈసీకి చంద్రబాబు లేఖ రాశారు.

 

సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. పెన్షన్లు ఇంటింటికీ పంపకుండా సెర్ప్ సీఈవో మురళీధర్ రెడ్డి చేస్తున్న కుట్రలనూ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఎండల్లో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు కిలోమీటర్ల దూరం వెళ్లలేరని…ఇంటి వద్ద పింఛను అందించే ఏర్పాటు చేయాలని కోరారు.

 

గ్రామ, వార్డు సచివాలయాల వద్దనే పెన్షన్ల పంపిణీ జరిపేలా సెర్ప్ సీఈవో ఆదేశాలు ఇచ్చారని, లబ్దిదారులను ఇబ్బందిపెట్టే ఈ ఆదేశాలలో కుట్ర దాగి ఉందని చంద్రబాబు ఆరోపించారు. ఇంటింటి పెన్షన్ లు అందకపోవడానికి టీడీపీయే కారణం అని తమకు ఆపాదిస్తూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛను అందించే చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎస్ ను కోరారని, కలెక్టర్లూ సీఎస్ తో వీడియో కాన్ఫరెన్స్ లో దీనికి అంగీకరించారని తెలిపారు.

 

రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బంది, ఇతర గ్రామస్థాయి ఉద్యోగుల ద్వారా లబ్దిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. అయితే పెన్షన్ల పంపిణీకి నోడల్ ఆఫీసర్ గా ఉండే సెర్ప్ సీఈవో దీనికి అభ్యంతరాలు చెపుతూ అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బంధువైన మురళీధర్ రెడ్డి గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ కేసుల్లో కూడా సహ నిందితుడిగా ఉన్నారని ఈసీకి తెలిపారు. ఇప్పుడు ఎన్నికల వేళ టీడీపీపై బురద జల్లడం కోసం ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేయవద్దని వైసీపీ ప్రభుత్వం మురళీధర్ రెడ్డిపై ఒత్తిడి చేస్తోందన్నారు.

 

ప్రస్తుతం రాష్ట్రంలో 40 డిగ్రీలకు మించి ఎండలు ఉన్నాయని, ఇలాంటి సమయంలో వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్ దారులు 4-5 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి రావడం ఇబ్బంది కలిగిస్తోందని చంద్రబాబు తెలిపారు. ఈ కారణంగా అందుబాటులో ఉన్న సచివాలయ ఉద్యోగులు, ఇతర శాఖల సిబ్బంది ద్వారా వెంటనే లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు.