AP

పవన్ కళ్యాణ్ కు భారీ షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఈసారి ఎలాగైనా ఎన్నికలలో విజయం సాధించి ఏపీలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని టిడిపి జనసేన బీజేపీ కూటమి ప్రయత్నం చేస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థుల విజయంతో పాటు, కూటమి విజయం కోసం గతానికి భిన్నంగా వ్యూహ, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు.

 

జనసేనకు షాక్.. దిక్కు తోచని స్థితిలో జన సైనికులు ఇక ఇదే సమయంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ భారీ షాకిచ్చింది. జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఈ నిర్ణయంతో జనసేన నేతలు షాక్ కి గురయ్యారు. ఒకపక్క జనసేన గుర్తు అయిన గాజు గ్లాసును ప్రజలలోకి తీసుకు వెళ్ళడానికి రకరకాల మాధ్యమాల ద్వారా ప్రయత్నం చేస్తున్న జనసైనికులు తాజాగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

 

ఏపీలో గుర్తింపు ఉన్న ప్రాంతీయ రాజకీయ పార్టీలివే ఎన్నికల కమిషన్ నిర్ణయం జనసేన పార్టీకి తీరని నష్టం చేస్తుందని వారు లబోదిబోమంటున్నారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాలలో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ, టీడీపీ గుర్తింపు పొందిన ప్రాంతీయ రాజకీయ పార్టీల జాబితాలో ఉండగా తెలంగాణలో ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు జాబితాలో ఉన్నాయి.

 

జనసేన గుర్తు గల్లంతు టీడీపీ, వైసీపీలకు గుర్తులను రిజర్వ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.జనసేన పార్టీని కేవలం రిజిస్టర్ చేసిన పార్టీలో జాబితాలో చేర్చింది. ప్రాంతీయ పార్టీలలో జనసేన పార్టీకి ఎటువంటి గుర్తింపు లేని కారణంగా ఆ పార్టీ గుర్తుగా కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ గా ప్రకటించింది.

 

పవన్ కళ్యాణ్ కు భారీ షాక్ గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తు పైన పోటీ చేశారు. కానీ ఈసారి ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాస్ చేరడంతో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. జనసేన పార్టీకి చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం పోవడంతో నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా ప్రకటించింది. ఇది ఎన్నికలకు ముందు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కు ఊహించని భారీ షాక్.