AP

టీడీపీ కూటమి గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తారు: అంబటి రాంబాబు..

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన తెలుగుదేశం-జనసేన- బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ ప్రజాగళం విఫలం కావడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ చంద్రబాబు నాయుడు చెప్పడాన్ని మంత్రి అంబటి రాంబాబు తప్పుపట్టారు. టీడీపీ కూటమి జనంలో ఆదరణ కోల్పోయిందనడానికి ప్రజా గళం నిదర్శనమని, ప్రజలు తమ వెంటే ఉన్నారనడానికి ఆ సభే ఉదాహరణ అని అన్నారు.

 

తనపై వైఎస్‌ఆర్సీపీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా దుష్ప్రచారం చేస్తోందని చంద్రబాబు చెప్పుకొంటోన్నాడని, నిజానికి ఆయనే ఓ పెద్ద మానిప్యులేటర్ అని ఎద్దేవా చేశారు. సాక్షాత్తూ ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ చిలకలూరిపేట సభకు హాజరైనప్పటికీ.. దాన్ని టీడీపీ చేతగానితనంతో సభ అట్టర్ ప్లాప్ అయిందని అన్నారు.

తమ అసమర్థతను పోలీసు యంత్రాంగంపై రుద్దే ప్రయత్నం చేస్తోన్నాడని అంబటి రాంబాబు అన్నారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు వంటి అనైతికమైన రాజకీయ నేత ఎవరూ లేరని, ఎన్నో మోసాలు చేసి అధికారంలోకి రావాలనే నీచమైన మనస్తత్వం కలిగిన నాయకుడనేది ప్రజలకు తెలుసునని అన్నారు.

 

బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి అధికారాన్ని అప్పగిస్తే.. ముస్లింలకు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్‌ ఎత్తేస్తారని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో అమిత్‌ షా ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేస్తామంటూ స్పష్టం చేశారని ఆయన గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా ప్రకటించారని అన్నారు.

 

ఏపీలో టీడీపీకి ఓటేస్తే.. మొదటిగా వారు చేసేది.. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయడమేనని అంబటి రాంబాబు అన్నారు. జగన్‌‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనంటూ 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రచారం చేశాడని అన్నారు. ఇప్పుడు అదే బీజేపీ పంచన చంద్రబాబు చేరాడని, దీనికి కారణం కేసుల భయమేనని అన్నారు.

 

చంద్రబాబుది అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే నైజమని, అందుకే మోదీని తిట్టిన నోటితోనే ఇప్పుడు జైకొడుతున్నాడని అన్నారు. ప్రజాగళం సభలో మైకు మూగబోయిందంటే అది అపశకునమేనని, అది కూటమి ఓటమిని సూచిస్తోందని చెప్పారు. ముగ్గురు కలిసినా సరుకు లేదని, జనం వారి సభకు రాలేదని పేర్కొన్నారు