National

ఎన్నికల షెడ్యూల్‌లో సవరణలు చేసిన ఈసీ.. జూన్ 2వ తేదీ నాడే ఓట్ల లెక్కింపు..

దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించాయి. భారీ బహిరంగ సభలు, రోడ్ షోలను నిర్వహించడంలో తలమునకలయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన, విజయం సాధించడానికి అవసరమైన వ్యూహ, ప్రతివ్యూహాలను పన్నుతున్నాయి.

 

లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర కమిషన్ శనివారమే విడుదల చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ ఎస్ఎస్ సంధూ ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరుగనున్నాయి.

 

లోక్‌సభ ఎన్నికలన్నీ ఏడు దశల్లో పూర్తవుతాయి. తొలి దశ- ఏప్రిల్ 19, రెండ విడత- ఏప్రిల్ 26, మూడో విడత- మే 7, నాలుగో విడత- మే 13, అయిదో విడత- మే 20, ఆరో విడత- మే 25, ఏడో విడత- జూన్ 1వ తేదీన ముగుస్తాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు నాలుగో విడతలో అంటే మే 13వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది.

 

తాజాగా ఈ షెడ్యూల్‌లో మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రత్యేకించి- అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీకి జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీలను మార్చింది కేంద్ర ఎన్నికల కమిషన్. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం- ఈ రెండు రాష్ట్రాల్లో జూన్ 4వ తేదీన అంటే మంగళవారం నాడు ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టాల్సి ఉంది.

 

ఈ తేదీని ముందుకు జరిపిింది ఈసీ. జూన్ 2వ తేదీన అంటే ఆదివారం నాడు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలల్లో ఓట్ల లెక్కింపును చేపట్టనున్నట్లు తెలియజేసింది. రాజ్యాంగబద్ధంగా తమకు సంక్రమించిన అధికారాల ఆధారంగా ఇందులో సవరణలు చేసినట్లు వివరించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి సంజీవ్ కుమార్ ప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు.

 

మొత్తం 60 లోక్‌సభ స్థానాలు ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ- నేషనల్ పీపుల్స్ పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలో ఉంది. అలాగే- 32 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న సిక్కింలో బీజేపీ- సిక్కిం క్రాంతికారి పార్టీ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది.