AP

వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అరెస్ట్..

ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కాకాణిని కేరళలో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా నిబంధనలకు విరుద్ధంగా పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఫిబ్రవరిలో కేసు నమోదు అయ్యింది.

 

అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డి ఏ4గా ఉన్నారు. పోలీసుల విచారణకు హాజరు కాకుండా గత రెండు నెలల నుంచి ఆయన పరారీలో ఉన్నారు. కాకాణి గత వైసీీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అక్రమ మైనింగ్ కేసులో విచారణకు రావాలంటూ ఇప్పటికే పోలీసులు 3 సార్లు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. నోటీసులకు స్పందించకపోవడంతోనే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

గత కొంతకాలంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయనను పట్టుకోవడం కోసం పోలీసులు కాకాణి బంధువుల ఇళ్ళు, ఫామ్ హౌస్ ల్లో గాలించారు. అయినప్పటికీ ఆయన ఎక్కడా దొరకలేదు. పోలీసులు పంపిన నోటీసులు తీసుకోకుండా విచారణకు రాకుండా ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. హైదరాబాదులో కొంతకాలం, బెంగళూరు, కేరళలో కొంతకాలం ఇలా తప్పించుకుని తిరుగుతున్నట్టు గుర్తించి ఆయన కోసం పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఎట్టకేలకు ఇవాళ కేరళలో మాజీ మంత్రి కాకాణిని పోలీసులు అరెస్ట్ చేశారు.