AP

బుగ్గమఠం భూములపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన పెద్దిరెడ్డి .. ఏపీ సర్కార్‌కు నోటీసులు..

బుగ్గమఠం భూముల వివాదంపై వైకాపా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని పేర్కొంది.

బుగ్గమఠానికి చెందిన 3.88 ఎకరాల ఆక్రమిత భూమిని ఖాళీ చేయాలంటూ మఠం కార్యనిర్వహణ అధికారి (అసిస్టెంట్ కమిషనర్) జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరం ఉంటే దేవాదాయ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత నెల 22న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, నిన్న జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించగా, దానిపై బదులు ఇవ్వడానికి పిటిషనర్‌కు మరో వారం గడువు ఇస్తూ విచారణను వాయిదా వేసింది.