AP

విజయవాడ వైసీపీలో టెన్షన్.. ఇంచార్జిలను మారుస్తున్న సీఎం జగన్..

వైసీపీలో ఇన్చార్జ్‌లుగా బాధ్యతలు స్వీకరించిన నేతలందరూ ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు. అయితే ఆ సెగ్మెంట్‌ కొత్త ఇన్చార్జ్ మాత్రం రకరకాల డౌట్లతో మీనమేషాలు లెక్కపెడుతున్నారు. చేతిచమురు వదిలించుకుంటూ జనంలోకి వెళ్తే.. చివరికి టికెట్ ఖాయమవుతుందో లేదో? అని టెన్షన్ పడిపోతున్నారు. వివిధ సెగ్మెంట్లలో వైసీపీ అధ్యక్షుడు ప్రకటించిన ఇన్చార్జులు ఓవర్ నైట్ మారిపోతుండటమే అందుకు కారణమంటున్నారు. సదరు సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేని షిఫ్ట్ చేసి మరీ ఆ నాయకుడికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు జగన్.. అయితే ఆయన కేవలం ఇన్చార్జ్ మాత్రమే అని అభ్యర్ది వేరే ఉన్నారన్న ప్రచారం మొదలైంది. దాంతో సదరు కొత్త నేత దిక్కులు చూడాల్సి వస్తోందంట.

 

వైసీపీ వరుసగా ఇన్చార్జుల లిస్టులు ప్రకటిస్తున్నప్పటి నుంచి.. ఎమ్మెల్యేలు, టికెట్ ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. ఎవరిని ఉంచుతారో, ఎవరిని తప్పిస్తారో.. అసలు ఈ మార్పులు చేర్పుల్లో టికెట్ దక్కెదెవరికో అర్ధం కాక తలలు పట్టుకోవాల్సి వస్తోంది అందరికీ. మరోవైపు ప్రకటించిన ఇన్చార్జిలను కూడా మారుస్తుండటంతో వారిలో టెన్షన్ మరింత పెరిగిపోతోంది.

 

విజయవాడ పశ్చిమ ఇన్చార్జ్ షేక్ ఆసీఫ్ కూడా అదే టెన్షన్‌తో సతమతమవుతున్నారంట. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావునిని విజయవాడ సెంట్రల్‌కు పంపించిన వైసీపీ పెద్దలు.. వెస్ట్ ఇన్చార్జి బాధ్యతలు ఆసీఫ్‌కి కట్టబెట్టారు. అయితే ఆయనకు బాధ్యతలు కట్టబెట్టినప్పటి నుంచే ఆ సెగ్మెంట్లో సరికొత్త ప్రచారం మొదలైంది. ఆసిఫ్ కేవలం ఇన్చార్జ్ మాత్రమే అని.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి ఆయన కాదన్న టాక్ ఆ పార్టీల్లోనే వినిపిస్తోంది.

 

ఆ ప్రచారానికి తగ్గట్లే ఇప్పటి వరకు ఆసిఫ్‌కు సీఎం జగన్ నుంచి పిలుపు రాలేదు. పార్టీ పెద్దలు సీఎంఓకి పిలిచి ఆయనకు టికెట్‌పై క్లారిటీ ఇవ్వలేదు. మొదటి లిస్టులోనే పేరు వచ్చినా ఇప్పటి వరకు సీయంఓ నుంచి కబురు రాకపోవడం, జగన్ అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో ఆసిఫ్ ఎవరికి చెప్పుకోలేక సమతమతవయతున్నారట‌. ఆసిఫ్ వైసీపీ స్థాపించిన నాటి నుంచి పశ్చిమ నియోజకవర్గంలో యాక్టీవ్ గా పనిచేస్తూ వచ్చారు. గతంలో ఒకసారి ఇన్చార్జ్‌గా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ.. సెగ్మెంట్లో పార్టీ శ్రేణులపై గ్రిప్ సాధించలేకపోయారన్న అభిప్రాయం ఉంది.

 

కార్పొరేటర్ గా , వైసీపీ మైనారిటి వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించినప్పటికీ.. నియోజకవర్గంలో వెల్లంపల్లి స్థాయిలో పాపులారిటీ సంపాదించుకోలేక పోయారు. మైనారిటీ లీడర్‌గా ఎస్టాబ్లిష్ అయినా.. పార్టీ పరంగా సరైన పదవి కూడా దక్కలేదాయనకి.. విజయవాడ మేయర్ పదవి ఆశించినా దక్కలేదు.. ఎమ్మెల్సీ పదవి అడిగినా ఇవ్వలేదు.. దీంతో పార్టీలో సరైన గుర్తింపు లేదని మధనపడుతుంటారాయన.. ఆ క్రమంలో సిలబస్‌లో లేని క్వశ్చన్ ఎగ్జమ్‌లో వచ్చినట్టు.. అసలు ఊహించని విధంగా వెల్లంపల్లిని పక్కనపెట్టి.. ఆసిఫ్‌ను ఇన్చార్జ్‌గా ప్రకటించడంతో.. ఆయనతో పాటు వెస్ట్ వైసీపీ కేడర్ కూడా షాక్ అయిందంట.

 

పార్టీలో సీనియర్ అన్న పేరు తప్ప.. వెల్లంపల్లి తరహాలో సౌండ్ పార్టీ కాకపోవడంతో.. అసిఫ్‌ను టెంపరరీ ఇన్చార్జ్‌గా మాత్రమే ఉంచుతారని ఆ పార్టీ శ్రేణులు ఓపెన్‌గానే అంటున్నాయి. ఆసిఫ్‌కు పార్టీ సమన్వయబాధ్యతలు కట్టబెట్టినప్పటికీ నియోజకవర్గంలో కీలకనేతలెవరూ ఆయన్ని పలకరించిన పాపన పోలేదు‌ వెల్లంపల్లి పక్క నియోజకవర్గానికి వెళ్లిపోవడంతో నిస్తేజంలో ఉన్న వైసీపీ కేడర్ కూడా అసిఫ్ కింద పనిచేయడానికి ఆసక్తి చూపించడం లేదంట.

 

ఆ పరిణామాలకు తోడు.. తనను అడగకుండానే ఇన్చార్జ్ ప్రకటించడం.. అందరూ ఇన్చార్జులతో మాట్లాడిన సీఎం తన ముఖం కూడా చూడకపోవడంతో ఆసిఫ్‌ కూడా ఆ బాధ్యతలు టెంపరరీనే అని భావిస్తున్నారంట. పశ్చిమ క్యాడర్ నుండి సహకారం లేకపోవడం, అభ్యర్దిని మారుస్తున్నారనే ప్రచారంతో ఢీలాపడ్డ ఆసీఫ్‌కు అనుకోకుండా దెందులూరు సిద్దం సభలో జగన్ ను కలిసే అవకాశం వచ్చింది. అయితే అక్కడ జస్ట్ జగన్ నమస్కారం మాత్రమే పెట్టారు. అప్పుడు తనకు పశ్చిమ ఇన్చార్జ్ అని చెప్పుకొనే అవకాశం కలిగినందుకు సంబరపడ్డారంట ఆయన.

 

దాంతో రెట్టింపు ఉత్సహంతో సెగ్మెంట్లో తిరుగుతామని భావించినా.. కేడర్ పరంగా సహకారం లభించడం లేదంట. వెల్లంపల్లి కూడా అసిఫ్‌కు అందరూ సహకరించాలని పిలుపునిచ్చినా పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు. మరోవైపు పార్టీ వర్గాలతో పాటు.. ప్రతిపక్షాలు కూడా ఆసిఫ్ అభ్యర్ధి కాదని ఊదరగొడుతుండటంతో.. జగన్ నుంచి క్లారిటీ కోసం ఎదురు చూడాల్సి వస్తోందంట కొత్త ఇన్చార్జికి.. అందుకే ఒక్కసారి జగన్ ఆయనే అభ్యర్ది అని ప్రకటిస్తే చాలు ప్రాణంపెట్టి పార్టీని గెలిపిస్తానని స్టేట్‌మెంట్లు ఇస్తోంది ఆసిఫ్ వర్గం.. మొత్తానికి అలా నడిచిపోతోంది అక్కడ వైసీపీ రాజకీయం.