AP

అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఆ ఫైల్ పైనే.. చంద్రబాబు కీలక హామీ..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా మర్కాపురం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాన తర్వాత తొలి సంతకం డీఎస్సీ ఫైల్ పైనే చేస్తానని యువతకు హామీ ఇచ్చారు. దీంతో పాటుగా జగన్ పాలనపై మండిపడ్డారు.

 

జగన్ పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడని చంద్రబాబు విమర్శించారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. వెలిగొండ నిర్వాసితులకు జగన్ ఇంత వరకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాలు పేరిట జగన్ నవ మోసాలు చేశాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజలకు మేలు చేసే పార్టీ ఏదో.. ముంచే పార్టీ ఏదో తేల్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

ఐదేళ్లలో జగన్ బటన్ పేరిట నొక్కిందెంత.. బొక్కిందెంత అని ప్రశ్నించారు. అయితే టీడీపీ అధికారంలోకి వస్తే మర్కాపురాన్ని కొత్త జిల్లాగా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మేం అధికారంలో రాగానే వెలుగొండ, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. టీడీపీ రామాయపట్నం పోర్టుకు అన్ని అనుమతులు వచ్చేలా చేస్తే.. వైసీపీ వచ్చాక పనులు ఆగిపోయాయన్నారు. వెలుగొండ పూర్తి అయితే 15 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేదని వెల్లడించారు. వెలుగొండలో మిగిలి ఉన్న 20 శాతం పనులను కూడా పూరత్తి చేయలేక పోయారని విమర్శించారు.

 

తమ ప్రభుత్వం అభివృద్ధికి పెద్ద పీట వేసినట్లు గుర్తుచేశారు. వైసీపీ పాలనలో ప్రజలు నాసిరకం మద్యం తాగి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలవాలంటే ఎన్డీయే కూటమిని గెలిపించాలని చంద్రబాబు కోరారు.