AP

అడ్వెంచర్ మూవీని తలపించే రెస్క్యూ

మౌంట్ అన్నపూర్ణ. నేపాల్‌లో ఉంటుందీ పర్వతం. పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ప్రపంచంలోని అతి ఎత్తయిన పర్వత శిఖరాల్లో ఇదీ ఒకటి. అతి ఎత్తయిన 10వ పర్వతంగా దీనికి గుర్తింపు ఉంది. సముద్ర మట్టానికి 8,091 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీన్ని అధిరోహించడం అంత సులువు కాదు. ఎప్పటికప్పుడు వాతావరణం మారిపోతుంటుంది. అలాంటి దుర్భేధ్య పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్లిన భారతీయ పర్వతారోహకుడొకరు మంచుదిబ్బల్లో చిక్కుకుపోయారు. 48 గంటల పాటు అందులోనే గడిపారు. ఆక్సిజన్ అందని సంక్లిష్ట వాతావరణ పరిస్థితుల నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన పేరు అనురాగ్ మాలూ. వయస్సు 34 సంవత్సరాలు. రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ ఆయన స్వస్థలం. మొత్తం ఏడుమందితో కూడిన టీమ్‌లో అనురాగ్ ఓ మెంబర్.

ఈ నెల 17వ తేదీన మౌంట్ అన్నపూర్ణను అధిరోహించిన ఆయన కిందికి తిరిగి వస్తూ క్యాంప్ 3 నుంచి దిగుతుండగా కనిపించకుండా పోయారు. ఆ టీమ్‌లో బల్జీత్ కౌర్, అనురాగ్ మాలూ గల్లంతయ్యారు. 48 గంటల తరువాత అనురాగ్‌ను మంచుకొండల మధ్య ఉండే అగాథం నుంచి ప్రాణాలతో వెలికితీశారు రెస్క్యూ సిబ్బంది. తెల్లటి మంచు తప్ప మరేమీ కనిపించని వాతావరణంలో, ఆయన వద్ద ఎక్స్‌ట్రాగా ఎలాంటి ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు లేవు. మంచుతో కప్పివున్న అగథంలో చలిని తట్టుకుని ఆయన 48 గంటల పాటు అక్కడే గడిపారు. ఆయనతో పాటు కనిపించకుండా పోయిన బల్జీత్ కౌర్‌ను మొదట్లో అందరూ చనిపోయారనే భావించారు. రేడియో యాక్టివ్ సిగ్నల్స్ ద్వారా ఆమె ఎక్కడ ఉన్నది గుర్తించారు. సురక్షితంగా వెలికి తీశారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనురాగ్‌ను మాత్రం బయటికి తీయడానికి రెండు రోజులు పట్టింది. ఏప్రిల్ 17వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు అనురాగ్ అగాథంలో పడిపోగా.. 20వ తేదీన ఆయనను ప్రాణాలతో రక్షించగలిగారు. ఆయనను రక్షించిన విధానం ఓ అడ్వెంచర్ సినిమాను తలపించింది.