AP

జనసేనలో చేరుతున్నా.. పవన్ కళ్యాణ్‌పై బాలశౌరి ఆసక్తికర వ్యాఖ్యలు..

పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలోకి మరో సీనియర్ నేత చేరిక ఖాయమైంది. ఇటీవల అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి త్వరలో మంచి ముహూర్తం చూసి జనసేన పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఆదివారం కృష్ణా జిల్లా మోపిదేవిలోని సుబ్రహ్మణ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

 

అనంతరం బాలశౌరి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసినట్లు తెలిపారు. పవన్ తో వివిధ అంశాలపై రెండు గంటలపాటు చర్చించినట్లు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి , పోలవరం ప్రాజెక్టు సహా అన్ని అంశాలపై పవన్ కళ్యాణ్‌కు స్పష్టమైన అవగాహన ఉందని బాలశౌరి తెలిపారు.

 

 

పవన్ నాయకత్వంలో పని చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు బాలశౌరి. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు అంకితం చేయడమే తన ధ్యేయమని అన్నారు. మచిలీపట్నం, అవనిగడ్డ ఎప్పుడూ తన గుండెల్లోనే చిరస్థాయిగా ఉంటాయని బాలశౌరి తెలిపారు.

 

మరోవైపు, వైయస్సార్సీపీకి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి అవనిగడ్డ నియోజకవర్గానికి వచ్చిన బాలశౌరికి.. జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పులిగడ్డ-పెనుమూడి వారధి టోల్‌గేట్ నుంచి మోపిదేవి ఆలయం వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

 

ఇది ఇలావుండగా, జనసేనలో చేరుతున్నట్లు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రకటించారు. అనకాపల్లిలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌కు రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళిక ఉందని చెప్పారు. రాజీలేని పోరాటం చేసే వ్యక్తని అన్నారు. రాష్ట్రంలో అరాచకపాలన అంతమొందించాల్సిన ఉందన్నారు.