TELANGANA

హైదరాబాద్ ప్రజలకు మరో వినూత్న సౌకర్యం.!

హైదరాబాద్: హైదరాబాద్ నగర వాసులకు మరో అద్బుత సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఆకాశంలో నడిచే భావన కలిగేలా నిర్మించిన వంతెనను నగర వాసులకు అందుబాటులోకి తేనుంది నగర పాలక సంస్ధ. జంట నగరాలు, శివారు ప్రాంతాల అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) త్వరలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఉప్పల్ చౌరస్తా వద్ద పాదచారుల రక్షణ కోసం నలువైపుల రోడ్డు దాటేందుకు వీలుగా ఆకాశ వంతెన స్కైవాక్(బోర్డ్ వాక్)ను ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురానుంది. సుమారు 25 కోట్ల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న ఉప్పల్ బోర్డ్ వాక్: రాబోవు వంద సంవత్సరాలకు ఉపయోగపడే నాణ్యతతో ప్రజాల సౌకర్యార్థం వినూత్న వంతెన(ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు) రూపకల్పనకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఉప్పల్ స్కైవాక్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో సుమారు వెయ్యి టన్నులకు పైగా స్ట్రక్చరల్ స్టీల్ ఉపయోగించారు. పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశాల మేరకు హైదరాబాద్ తూర్పు (ఈస్ట్) వైపు అభివృద్ధిని, పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని మూడేళ్ల క్రితం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసారు.

పాదచారులకు రక్షణ, ఆకాశ వంతెన: ఆర్కిటెక్చర్లు, డిజైనర్లు, సీనియర్ ఇంజనీర్ల బృందానికి ఉప్పల్ సర్కిల్లో కొత్త ప్రాజెక్టు బాధ్యతలను మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ అప్పగించారు. వారు రూపొందించిన కొన్ని నమూనాల నుంచి ప్రస్తుత పాదచారుల వంతెన డిజైను ఎంపిక చేసి దాదాపు 25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను హెచ్ఎండిఏకు అప్పగించారు. ముఖ్యంగా ఉప్పల్ చౌరస్తాలో రోడ్డు దాటే సమయంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, ప్రమాదాలలో ఎక్కువ శాతం మహిళలు, పాఠశాల విద్యార్థులు గాయపడుతున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని అక్కడ పాదచారుల వంతెన నిర్మాణం శ్రేయస్కారమని ప్రభుత్వం నిర్ణయించింది. అందుబాటులో 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కిలేటర్లు: వెంటనే పాదచారుల వంతెన ప్రాజెక్టు పనుల నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు అప్పగించింది. సుదీర్ఘకాలం చెక్కు చెదరకుండా, మన్నికగా నిర్మించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పాదచారుల వంతెన నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL), వైజాగ్ స్టీల్ (విశాఖపట్నం) తోపాటు జిందాల్ స్టీల్ కంపెనీలకు చెందిన స్ట్రక్చరల్ స్టీల్ ఉపయోగించడం జరిగింది. పాదచారుల వంతెన ప్రాజెక్టులో భాగంగా ప్రజలకు 8 లిఫ్టులు, 6 స్టేర్ కేసులు, 4 ఎస్కిలేటర్లు అందుబాటులో ఉంటాయి.