AP

దూకుడు పెంచిన షర్మిల..

పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చెప్పట్టిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దూసుకుపోతున్నారు వైఎస్ షర్మిల. ఏపీకి నియంత పాలన నుంచి విముక్తి కల్పించడమే తన లక్ష్యమంటున్న షర్మిలపై.. వైసీపీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. ముఖ్యంగా మంత్రి రోజా ఆమెపై ధ్వజమెత్తడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు. చంద్రబాబు వదిలిన బాణం షర్మిల అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేతల విమర్శలకు షర్మిల గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీ నుండి రోజుకో జోకర్ మాట్లాడుతున్నారంటున్న షర్మిల.. నగరి టూర్‌లో రోజాపై చేసిన ఆరోపణలతో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది.

 

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో ఏపీసీసీ చీఫ్ షర్మిల వర్సెస్ వైసీపీగా రాజకీయం మారుతోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల సీఎం జగన్‌పై, వైసీపీ నేతలపై విమర్శల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుండటం కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. షర్మిలకు ధీటుగా వైసీపీ నేతలు సైతం కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా మంత్రి రోజా ఆమెను టార్గెట్ చేయడంలో ముందుంటున్నారు.

 

తాజాగా వైఎస్ షర్మిల రాష్ట్ర మంత్రి ఆర్కే రోజాపై చేసిన ఆరోపణలు నగరి నియోజకవర్గంలో ప్రకంపనలు రేపుతున్నాయి. మంత్రి రోజా నియోజకవర్గంలో జబర్దస్త్ దోపిడీ జరుగుతోందని, రోజా కుటుంబం వందల కోట్లు దోచుకుందని ఆరోపణలు గుప్పించారు. నగరిలో ఒకరు కాదు నలుగురు మంత్రులు ఉన్నారని ప్రజలు అంటున్నారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చన్నారు. రోజా ఓ మంత్రి, ఆమె భర్త ఓ మంత్రి, ఆమె అన్నలు ఇద్దరు కూడా మంత్రులేనంటూ సెటైర్లు విసిరారు. నగరిలో రోజా జబర్దస్త్ దోపిడీకి పాల్పడుతున్నారని, గ్రావెల్స్ వదలరు, చెరువులను, ఇసుక కూడా వదలరని ఆరోపించారు.

 

తాను తెలంగాణలో పార్టీ పుట్టానని రోజా అంటోందని.. గతంలో ఆమె టీడీపీలో ఉన్నప్పుడు ఐరన్ లెగ్ గా ఫేమస్ కాదా అని షర్మిల ఎద్దేవా చేశారు. టీడీపీ నేతగా ఉన్నప్పుడు రోజా.. వైఎస్‌పై చవకబారు కామెంట్లు చేశారని గుర్తుచేశారు. వైఎస్ పంచ ఊడదీసి కొడతానన్న రోజా.. ఇప్పుడు జగన్ పార్టీలో ఉందని యద్దేవా చేశారు. రోజా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు.

 

పుట్టింట్లో అన్యాయం జరుగుతోందని, ఏపీకి రావాల్సి వచ్చిందన్నారు. తెలంగాణలో నియంతను గద్దె దింపాను, ఇప్పుడు ఏపీలో నియంతను గద్దె దింపడమే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వైటీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశామని, కాంగ్రెస్ ఉన్నంతవరకు తమ పార్టీ బతికే ఉంటుందన్నారు. మణిపూర్‌లో క్రైస్తవులపై దాడులు జరుగుతున్న ఒక క్రైస్తవుడు అయి ఉండి జగన్ స్పందించలేదని ఫైర్ అయ్యారు.

 

నగరిలో షర్మిల కామెంట్స్‌పై రోజా రియాక్ట్ అయ్యారు. షర్మిల మొన్నటి వరకు తాను తెలంగాణ బిడ్డని అన్నారని.. ఇప్పుడు ఆమె మరో కొత్త అవతారం ఎత్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టి ఏమి చేయలేక గాలికొదిలేసి…. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శించారు.

 

నిజమైన రాజన్న బిడ్డ సీఎం జగన్ మాత్రమేనని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల కేవలం వైఎస్ ఆస్తుల కోసమే రోడ్డు ఎక్కారని తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు వదిలిన బాణం షర్మిల అని సెటైర్ వేశారు. షర్మిల వేషం కాంగ్రెస్ ది.. స్క్రిప్ట్ చంద్రబాబుది అంటూ విమర్శించారు.

 

మొత్తానికి నగరిలో రోజాపై వైఎస్ షర్మిల చేసిన అవినీతి ఆరోపణలలో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఒకవైపు నగరి సీటుపై క్లారిటీ లేక కన్‌ఫ్యూజన్‌లో ఉన్న మంత్రి రోజా.. అధినేతను ప్రసన్నం చేసుకోవడానికి షర్మిలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారన్న సెటైర్లు షోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మరి చూడాలి రాష్టానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు ఇక్కడి నుంచి కదలనంటున్న వైఎస్ షర్మిలారెడ్డి దూకుడు మున్ముందు ఎలా ఉంటుందో.