AP

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సంక్రాంతి పండగ జోష్

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సంక్రాంతి పండగ జోష్ లో ఉన్నారు. తన సొంత ఊరిలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య పండగ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. రోజూ రాజకీయాల కార్యకలాపాలు, సమావేశాలతో తీరిక లేకుండా గడిపే చంద్రబాబు పండగను పురస్కరించుకుని మనవళ్లతో సరదాగా గడుపుతున్నారు. మధ్యమధ్యలో రాజకీయ ప్రత్యర్థులపై చురకలూ వేస్తోన్నారు. మూడు సంవత్సరాల విరామం తరువాత చంద్రబాబు కుటుంబం నారావారి పల్లికి చేరుకోవడం ఇదే తొలిసారి. 2014 నుంచి 2019 వరకు క్రమం తప్పకుండా ఆయన సంక్రాంతి పండగ సమయంలో తన సొంతూరికి వెళ్లే సంప్రదాయాన్ని పాటించిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు ఆయన అక్కడ తన బంధుమిత్రులతో కలిసి నారావారిపల్లిలో సంక్రాంతి వేడుకలను జరుపుకొనే వారు. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తరువాత- సంక్రాంతి నాడు సొంత ఊరికి వెళ్లే సంప్రదాయానికి పుల్ స్టాప్ పెట్టారు.

ఇప్పుడు మళ్లీ నారావారిపల్లికి వెళ్లారు. ఈ వేడుకలు ముగిసిన అనంతరం సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌ కు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. కాగా అంతకంటే ముందు చంద్రబాబు జిల్లాలోని పీలేరుకు వెళ్లనున్నారు. పీలేరు సబ్ జైలులో పార్టీ కార్యకర్తలను ఆయన ములాఖత్ కానున్నారు. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రొంపిచెర్లలో ఈ నెల 7వ తేదీన చోటు చేసుకున్న ఘర్షణలో అరెస్టయిన కార్యకర్తలను ఆయన పరామర్శించనున్నారు. పుంగనూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పట్టణంలో వైసీపీ నాయకులు కట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, లోక్ సభ సభ్యుడు మిథున్ రెడ్డిల ఫ్లెక్సీలు, బ్యానర్లను చింపేశారు. వారిని అడ్డుకోవడానికి పెద్దిరెడ్డి వర్గీయులు ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. రొంపిచెర్ల బస్టాండ్ సెంటర్ లో కట్టిన బ్యానర్లు, ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చింపేయడాన్ని ప్రతిఘటించారు వైసీపీ కార్యకర్తలు. ఈ ఘర్షణల సందర్భంగా పోలీసులు రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వారిని పీలేరు సబ్ జైలుకు తరలించారు. అరెస్టయిన పీలేరు సబ్ జైలులో ఉన్న టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించారు. టీడీపీ పీలేర్ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సహా పలువురు నాయకులు సబ్ జైలుకు వెళ్లనున్నారు.