ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో జులై 26 నుంచి 30 వరకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఓ టీమ్ అక్కడ పర్యటించనుంది. సింగపూర్‌లో వ్యాపారవర్గాలతో ఈ బృందం సమావేశం కానుంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిపోయింది. మరో నాలుగేళ్లు మాత్రమే మిగిలివుంది. ప్రస్తుతం రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే బాగుంటుందని ఆలోచన చేశారు సీఎం చంద్రబాబు. వివిధ దేశాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలతో మంతనాలు సాగిస్తున్నారు.
పెట్టుబడులు వస్తే ఏపీ ఎకానమీ పుంజుకోవడంతోపాటు యువతకు ఉపాది అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జులై చివరివారం సింగపూర్ టూర్‌కి ప్లాన్ చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేశ్, నారాయణ, టీజీ భరత్ ఆ టీమ్‌లో ఉన్నారు. సీఎం టూర్‌లో అధికారులు కాటమనేని భాస్కర్, యువరాజ్, కార్తికేయ మిశ్రా, కన్నబాబు, ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు నుంచి సాయికాంత్ వర్మ అక్కడికి వెళ్లేవారిలో ఉన్నారు.
సింగపూర్‌లో వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలతో చంద్రబాబు టీమ్ సమావేశం కానుంది. ఏపీకి విశాలమైన తీరప్రాంతంతోపాటు అభివృద్ధి చేయడానికి వనరులను అక్కడి వారికి వివరించనున్నారు. ముఖ్యంగా నగరాల ప్రణాళిక, సుందరీకరణ, ఉద్యానవనాలు, ఓడరేవులు, మౌలిక వసతుల కల్పన, సాంకేతికతను అందిపుచ్చుకోవడం వాటిపై చర్చలు జరపనుంది.
ఈ టూర్‌కి సంబంధించి వివరాలను తెలుపుతూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి యువరాజ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రాజధాని నిర్మాణం కోసం అప్పట్లో సీఎం చంద్రబాబు సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రాగానే ఆయా ఒప్పందాలు రద్దయిన విషయం తెల్సిందే. ఏపీలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సింగపూర్ వెళ్లడం ఇదే తొలిసారి. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటనపై అప్పుడే విపక్ష వైసీపీ రకరకాలు కామెంట్స్ చేస్తోంది.