AP

ఏపీలో ఆపరేషన్ గరుడ దూకుడు..! భారీగా కేసులు నమోదు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి వ్యాప్తిని నియంత్రించడంలో.. ప్రభుత్వం చేపట్టిన కృషి ఫలితాలను ఇవ్వడం ప్రారంభించిందని.. హోమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గతంలో ఏపీ గంజాయి హబ్‌గా పేరు గాంచిందని, ఇతర రాష్ట్రాల్లో గంజాయి పట్టుబడితే అది ఏపీ నుంచే వచ్చినదిగా భావించేవారని ఆమె గుర్తు చేశారు.

 

ఈ అంశాన్ని సమగ్రంగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి ప్రతిపాదనతో.. ‘ఈగల్’ అనే ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. రవికృష్ణను డైరెక్టర్‌గా నియమించి ఈగల్‌ను కార్యాచరణలోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈగల్‌ టీమ్ విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలలో మూడు ప్రాంతీయ కేంద్రాలతో పని చేస్తోంది. ఈ బలగం అన్ని కీలక మార్గాలను పర్యవేక్షిస్తూ, గంజాయి అక్రమ రవాణాను అరికట్టే కృషి చేస్తోంది.

 

ఏజెన్సీ ప్రాంతాల నుండి వచ్చే ప్రధాన రూట్లపై సీసీ కెమెరాలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో అక్రమ రవాణాపై అణిచివేత సాధ్యమైంది. ఇప్పటివరకు మొత్తం 831 గంజాయి కేసులు నమోదు చేశామని ఆమె తెలిపారు.

 

గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తూ, పాడేరు ప్రాంతంలో గంజా ఆయిల్ తయారీకి మిషన్లు పని చేశాయని, స్కూలు బ్యాగుల్లోకి కూడా గంజాయి ప్యాకెట్లు వెళ్లిపోయాయన్న దుస్థితి ఉన్నదని గుర్తు చేశారు. దీనికి విరుద్ధంగా ప్రస్తుత ప్రభుత్వం ఒక యజ్ఞంలా గంజాయి నిర్మూలన కోసం పనిచేస్తోందని స్పష్టం చేశారు.

 

ఈగల్ బలగం ద్వారా రోజూ ఎక్కడో ఒకచోట.. గంజాయి పదార్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ పేరుతో విద్యాసంస్థల సమీపాల్లో మత్తు పదార్థాల అమ్మకాన్ని.. నిరోధించే కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. క్వాట్‌పా యాక్ట్ ప్రకారం స్కూలులు, కళాశాలలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు సంబంధిత వస్తువులు అమ్మకూడదని స్పష్టం చేశారు.

 

“ఆపరేషన్ గరుడ” కార్యక్రమంలో భాగంగా మెడికల్ షాపులపై దాడులు నిర్వహించామని, ప్రిస్క్రిప్షన్ లేని మందులు, వైట్ నర్, ఇంజెక్షన్లు అమ్మకుండా చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు.

 

గంజా పంటకు ప్రత్యామ్నాయంగా రైతులకు మద్దతుగా ప్రభుత్వం 40 లక్షల మొక్కలను పంపిణీ చేసినట్టు చెప్పారు. గంజా పంట కన్నా మంచి ఆదాయం ఇచ్చే మొక్కల వైపు రైతులను మళ్లించామని వివరించారు. గతంలో 20 వేల ఎకరాల్లో సాగయ్యే గంజాయి ఇప్పుడు 90 ఎకరాలకు తగ్గించామని, జీరో కల్టివేషన్ దిశగా పురోగమిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.

 

పురాతన కాలం నుంచి సాగు చేసినట్లు భావించే గంజాయి పంటకు భద్రంగా ప్రత్యామ్నాయ పంటలుగా సిల్వర్ ఓక్, ఇంటర్ క్రాప్స్ వంటి వాటిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. సిల్వర్ ఓక్ పంటకు మూడు సంవత్సరాల సమయం పడతుందని, ఆలోచించుకున్న వ్యవస్థతో మధ్య కాలంలో ఇతర పంటలు వేసుకునే విధంగా రైతులకు మార్గనిర్దేశం చేశామని చెప్పారు.

 

చివరగా, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 68,620 కిలోల గంజాయిని ధ్వంసం చేశామని ప్రకటించారు. ఇది ప్రభుత్వం కట్టుదిట్టంగా తీసుకున్న చర్యల ఫలితమని, మత్తు పదార్థాల విస్తృత వ్యాప్తిని అరికట్టే దిశగా ఇదొక గొప్ప మైలురాయిగా పేర్కొన్నారు.

 

గంజా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం చేసిన ఈ కృషి.. దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుందని హోమంత్రి అనిత తెలిపారు.