విశాఖ పోలీసులు మానవ అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు చేశారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతీ యువకులను కాంబోడియా, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్ వంటి దక్షిణాసియా దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న పలువురిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి తెలిపిన వివరాల ప్రకారం.. నిరుద్యోగులను విదేశాలకు అక్రమ రవాణా చేస్తోన్న పలువురిని అరెస్టు చేశామని, వారి చేతుల్లో మోసపోయిన 85 మంది అమాయకులను స్వదేశానికి సురక్షితంగా రప్పించామని తెలిపారు.
కొందరు ఏజెంట్లు డేటా ఎంట్రీ ఉద్యోగం, రూ.లక్షల్లో జీతం అంటూ ఆశ చూపి ఆకర్షణీయమైన ప్రకటనలతో యువతను ఉచ్చులో దింపుతున్నారని, నిరుద్యోగ యువతను నమ్మిస్తూ విదేశాల్లోని చైనా ఆధారిత స్కామ్ కంపెనీల్లో నేరాలు చేయించడానికి తరలిస్తున్నారని చెప్పారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అక్కడికి వెళ్తున్నారన్నారు. ఈ ఘటనలకు సంబంధించి 9 కేసుల్లో 22 మందిని అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు.
ఈ నెల 14న కాంబోడియాకు నలుగురు యువతీ యువకులను డేటా ఎంట్రీ జాబ్ పేరుతో పంపించడానికి ప్రయత్నించిన గాజువాకకు చెందిన ఏజెంట్ సురేశ్, ఆదిలక్ష్మి అలియాస్ అనును విశాఖపట్నం విమానాశ్రయం వద్ద అరెస్టు చేశామని తెలిపారు. ఏజెంట్ సురేశ్ ఇదివరకే కాంబోడియా వెళ్లి అక్కడ చైనా స్కామ్ కంపెనీలో పనిచేశాడని, అక్కడ విజయకుమార్ అలియాస్ సన్నీతో పరిచయం పెంచుకొని ఇటీవల దేశానికి తిరిగి వచ్చి కాంబోడియాలోని సైబర్ స్కామ్ కంపెనీకి ఏజెంట్‌గా మారాడని చెప్పారు.
అతను ఇప్పటివరకు 12 మందిని పంపినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుల నుంచి ఆరు సెల్ ఫోన్లు, రూ.50 వేలు, 2 వేల యూఎస్ డాలర్లు, 20 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. కాంబోడియా, మయన్మార్‌కు వెళ్లి అక్కడ చిక్కుకున్న 85 మందిని విశాఖకు రప్పించామని సీపీ తెలిపారు. మిగతా బాధితులను కూడా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఉత్తరాంధ్ర నుంచి విజిటింగ్ వీసాలపై కాంబోడియా, మయన్మార్ వెళ్లిన వారు దాదాపు 500 మంది వరకు ఉన్నారని తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా రిక్రూట్‌మెంట్ ఏజెంట్లు, కన్సల్టెన్సీల పేరుతో ప్రజలను మోసం చేస్తే ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 1983 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనధికార ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. యువత, వారి తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విదేశీ ఉద్యోగాల పేరుతో ఎవరైనా అధిక మొత్తంలో డబ్బు డిమాండ్ చేసినా, లేక అనుమానం వచ్చినా విశాఖ సీపీ ప్రత్యేక నంబర్ 7995095799 కు లేదా 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సీపీ విజ్ఞప్తి చేశారు.