వైఎస్ వివేకా హత్య కేసు విచారణ నత్తనడకన సాగుతోందంటూ ఆయన కుమార్తె సునీత ఆరోపిస్తున్నారు. హత్యకేసులో కీలక నిందితులు తప్పించుకోవాలని చూస్తున్నారని, తమకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ అప్రూవర్ గా మారిన దస్తగిరిపై ఒత్తిడి తెచ్చారని అంటున్నారు. ఈ బెదిరింపులపై ఆమె చేసిన ఫిర్యాదుని పరిగణలోకి తీసుకుని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కడప జైలులో దస్తగిరిని బెదిరించిన విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేతృత్వంలో ఈ కమిటీని నియమించారు. పోలీస్, మెడికల్, రెవెన్యూ అధికారులతో కమిటీ ఏర్పాటైంది.
అసలేం జరిగింది..?
వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దస్తగిరి కడప జైలులో ఉండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. కడప జైలులో మెడికల్ క్యాంప్ పేరుతో బ్లాక్ మెయిల్ కి తెరతీశారని అంటున్నారు. ఈ బ్లాక్ మెయిలింగ్ కోసం డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డి మెడికల్ ఆఫీసర్ గా కడప జైలుకి వెళ్లారు. ఈయన వివేకా హత్యకేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు కావడం, ఏరికోరి ఆ డాక్టర్ నే వివేకా హత్యకేసు ముద్దాయి ఉన్న కడప జైలుకి పంపించడం అప్పట్లో సంచలనంగా మారింది. అలా లోపలికి వెళ్లిన డాక్టర్ చైతన్యరెడ్డి, దస్తగిరిని బెదిరించారనే ఆరోపణలున్నాయి. తమ పేరుని పోలీసుల ముందు చెప్పకుండా ఉండాలని డబ్బులు ఎరవేసినట్టు కూడా చెబుతున్నారు. ఈ విషయాన్ని దస్తగిరి భార్య పలుమార్లు మీడియా ముందు, పోలీసుల ముందు కూడా చెప్పారు. 2023 అక్టోబర్, నవంబర్ నెలల్లో మెడికల్ క్యాంప్ ల పేరుతో ఈ ఎపిసోడ్ జరిగితే.. అప్పటి వైసీపీ ప్రభుత్వం కనీసం తన ఫిర్యాదుని పట్టించుకోలేదని దస్తగిరి భార్య చెప్పేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వివేకా కుమార్తె సునీత కూడా ఇదే విషయాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్‌ను నియమించగా.. ఆయన కడప జైలులో దస్తగిరిని ప్రశ్నించి పలు వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత డాక్టర్ చైతన్యరెడ్డి, ప్రకాశ్‌రెడ్డిని కూడా విచారణకు పిలిపించారు. తన విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలను ఆయన దర్యాప్తులో పొందుపరిచి హోంశాఖకు సమర్పించారు. మెడికల్ క్యాంప్ నిర్వహణలో లోపాలున్నాయని, వాటికి బాధ్యులుగా అప్పటి జైలు అధికారులు ప్రకాష్, జవహర్ బాబు, డిప్యూటీ సివిల్ సర్జన్ పుష్పలతపై చర్యలు తీసుకోవాలని ఆయన సిఫారసు చేశారు. దీంతో ఆ ముగ్గురికి ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఈ కుట్రలో వైద్యులు, పోలీసులు, ఇతర విభాగాలకు చెందిన కొంతమంది ప్రమేయం ఉందని తేటతెల్లం కావడంతో తదుపరి విచారణకు తాజాగా ప్రభుత్వం కమిటీని నియమించింది. లోతుగా దర్యాప్తు చేసి వెంటనే హోంశాఖకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
రూ. 20కోట్ల ఆఫర్
దస్తగిరి అప్రూవర్ గా మారడం వివేకా హత్య కేసులో కీలక పరిణామం అనుకున్నా.. ఆ తర్వాత కేసు విచారణ పెద్దగా ముందుకు సాగలేదు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అరెస్ట్ తర్వాత కేసు విచారణ నెమ్మదించినట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వ హయాంలో అయినా తనకు న్యాయం జరగాలని కోరుతున్నారు డాక్టర్ సునీత. అప్పట్లో మెడికల్ క్యాంప్ పేరుతో జైలులోకి వెళ్లిన డాక్టర్ చైతన్యరెడ్డి.. తప్పుడు సాక్ష్యం చెపితే రూ.20కోట్లు ఇస్తామనే ఆఫర్ కూడా ఇచ్చారట. తమ మాట వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా బెదిరించినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇప్పుడు విచారణ కమిటీ నిర్థారించాల్సి ఉంది.