AP

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేసి మళ్లీ జరపాలి: జగన్ డిమాండ్..

పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జడ్పీటీసీ సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట జడ్పీటీసీ సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారని, ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగంచేస్తూ, అధికారులను చెప్పుచేతల్లోకి తీసుకుని, పోలీసులను వాడుకుని, ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్‌ చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఈరోజు నిజంగా ఒక బ్లాక్‌ డే అని జగన్ అభివర్ణించారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేస్తున్నామని స్పష్టం చేశారు.

 

పోలీసుల సాయంతో రిగ్గింగ్

 

చంద్రబాబు ప్రభుత్వం క్షుద్ర రాజకీయానికి తెరలేపిందని జగన్ విమర్శించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా, పలు గ్రామాల్లోని పోలింగ్ బూత్‌లను ఓటర్లకు దూరంగా మార్చారని ఆరోపించారు. “నిన్న రాత్రి నుంచే బయట ప్రాంతాలకు చెందిన వందలాది మంది టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లోకి చొరబడి, తెల్లవారుజాము నుంచే బూత్‌లను ఆక్రమించుకున్నారు. మా ఏజెంట్లపై, మహిళలపై దాడులు చేసి, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి తరిమికొట్టారు. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని దొంగ ఓట్లు వేయించారు,” అని జగన్ వివరించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులే టీడీపీ నేతల అక్రమాలకు దగ్గరుండి కాపలా కాశారని, డీఐజీ కోయ ప్రవీణ్ వంటి అధికారులు ఈ అక్రమాలను ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు.

 

పాలనలో విఫలమయ్యే ఈ అరాచకాలు

 

తన 15 నెలల పాలనలో చంద్రబాబు అన్ని రంగాల్లోనూ విఫలమయ్యారని, ప్రజల మద్దతు కోల్పోయారనే భయంతోనే ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని జగన్ విమర్శించారు. “వ్యవసాయం, విద్య, వైద్యం వంటి రంగాలను నాశనం చేశారు. విద్యార్థులకు ట్యాబులు, విద్యా దీవెన వంటి పథకాలను రద్దు చేశారు. కరెంట్ ఛార్జీల బాదుడు, ఇసుక, మట్టి, లిక్కర్ మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఇలాంటి పాలన చేస్తున్న చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తారు? ఆ నమ్మకం లేదు కాబట్టే ఈ అరాచకాలకు దిగారు,” అని ఆయన అన్నారు.

 

ఎన్నికలు రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలి

 

రెండు చిన్న జడ్పీటీసీ స్థానాల కోసం ఇంతగా దిగజారాల్సిన అవసరం ఏముందని జగన్ ప్రశ్నించారు. 2017 నంద్యాల ఉప ఎన్నికలో కూడా ఇలాగే అక్రమాలు చేసి గెలిచినా, ఏడాదిన్నర తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీని చిత్తుగా ఓడించారని గుర్తుచేశారు. పులివెందుల ప్రజలు కూడా భవిష్యత్తులో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ ఎన్నికల అక్రమాలపై తమ వద్ద ఉన్న ఆధారాలతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఈ అన్యాయాన్ని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.