AP

విశాఖను ముంచెత్తిన వాన.. జీవీఎంసీ హై అలర్ట్..

సాగర నగరం విశాఖపట్నాన్ని ఆదివారం భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు నగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 

విశాఖ నగరంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, గాజువాక, పెద్ద గంట్యాడలో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ముఖ్యంగా గాజువాకలోని డైరీ కాలనీ, హెచ్‌బీ కాలనీ, రిక్షా కాలనీ వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి సుమారు మూడు అడుగుల మేర వరద నీరు చేరింది. మరోవైపు, జ్ఞానాపురం, చిలకపేట, వన్ టౌన్ ఏరియాల్లో వరద ఉద్ధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. హనుమంతవాక, తాడిచెట్ల పాలెం వంటి కొండ ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

 

ఈ పరిస్థితుల నేపథ్యంలో జీవీఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భారత వాతావరణ శాఖ మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, ఉరుములు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించడంతో, కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అత్యవసర సహాయక చర్యల కోసం అన్ని విభాగాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

 

ప్రజల సహాయార్థం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధితులు తమ సమస్యలను 1800 4250 0009 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని కమిషనర్ సూచించారు. లోతట్టు ప్రాంతాలు, శిధిలావస్థలో ఉన్న ఇళ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లను పునరావాస కేంద్రాలుగా సిద్ధం చేసినట్లు వివరించారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ కావడంతో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.