AP

కుప్పం ప్రజలకు గుడ్ న్యూస్..! కుప్పం అభివృద్ధికి 6 కీలక ఎంవోయూలు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టనుంది. పారిశ్రామికంగా కుప్పం రూపురేఖలను మార్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ఏకంగా విమానాలు, రాకెట్ల తయారీ యూనిట్లతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఫైబర్ బోర్డు పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కుప్పం పర్యటన సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వివిధ ప్రతిష్ఠాత్మక సంస్థలతో మొత్తం 6 కీలక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా కుప్పంలోకి రూ. 2,050 కోట్లకు పైగా పెట్టుబడులు రానుండగా, వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

 

కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయి. కింగ్స్‌వుడ్ డెకార్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 1,100 కోట్ల భారీ పెట్టుబడితో మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డు (ఎండీఎఫ్) ఉత్పత్తి యూనిట్‌ను స్థాపించనుంది. దీని ద్వారా నేరుగా 2,012 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

 

అలాగే, పయనీర్ క్లీన్ యాంప్స్ లిమిటెడ్ సంస్థ రూ. 150 కోట్ల పెట్టుబడితో 2-సీటర్ శిక్షణ విమానాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్‌లో ఏటా 70 నుంచి 100 విమానాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 250 మందికి ఉపాధి లభించనుంది.

 

బెంగళూరుకు చెందిన స్పేస్ టెక్నాలజీ సంస్థ ‘ఎత్రెయాల్ ఎక్స్‌ప్లోరేషన్ గిల్డ్’ రూ. 500 కోట్ల పెట్టుబడితో మీడియం లిఫ్ట్ లాంచింగ్ రాకెట్ తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మరో 500 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.

 

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు కూడా పెద్దపీట వేశారు. రెడ్ బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్ సంస్థ రూ. 300 కోట్ల పెట్టుబడితో అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ మామిడి, జామ, టమాటో పల్పింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఏకంగా 15 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రతిపాదించింది.

 

మరోవైపు మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ, ‘షీలీడ్స్’ అనే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా కుప్పం నియోజకవర్గంలో 10 వేల మంది మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంతో పాటు, వారి ఉత్పత్తులకు గ్రామీణ మార్కెట్లను అందిపుచ్చుకునేలా శిక్షణ ఇవ్వనున్నారు.

 

పర్యావరణ పరిరక్షణలో భాగంగా, ఏజీఎస్-ఐటీసీ సంస్థతో వ్యర్థాల నుంచి సంపద సృష్టించే కార్యక్రమం కోసం ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ సంస్థ 15 ఏళ్ల పాటు వ్యర్థాల సుస్థిర నిర్వహణపై ప్రజల్లో, పాఠశాలల్లో అవగాహన కల్పించనుంది.