AP

ఇండోసోల్ కంపెనీ కోసం బలవంతంగా భూములు లాక్కోవడం లేదు: మంత్రి అనగాని..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కరేడు వద్ద ఇండోసోల్ పరిశ్రమ ఏర్పాటు కోసం రైతుల నుంచి భూములను బలవంతంగా సేకరిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎకరాకు రూ. 20 లక్షల పరిహారాన్ని ప్రకటించడంతో, రైతులు పూర్తి స్వచ్ఛందంగానే తమ భూములను పరిశ్రమకు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు.

 

శాసనమండలిలో వైసీపీ సభ్యుడు తూమాటి మాధవరావు అడిగిన ప్రశ్నకు మంత్రి అనగాని సమాధానమిచ్చారు. ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండోసోల్ పరిశ్రమ ఏర్పాటు కోసం జరుగుతున్న భూసేకరణలో ఎలాంటి ఒత్తిళ్లకు తావులేదని ఆయన తేల్చిచెప్పారు.

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “రామాయపట్నం పోర్టు నిర్మాణం ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష. దానికి అనుబంధంగా ఒక పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా, ఇండోసోల్ సంస్థ రూ. 43 వేల కోట్ల భారీ పెట్టుబడితో పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు వచ్చింది” అని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మొత్తం 8,214 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టు కోసం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

 

గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోయాయని, కానీ తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి అనగాని విమర్శించారు. రైతులకు న్యాయమైన పరిహారం అందిస్తూ, పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గొప్ప ఊతాన్ని ఇస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.