AP

ఏపీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం..! ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై సిట్ దాడులు..

ఏపీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లక్ష్యంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. మంగళవారం ఉదయం హైదరాబాద్, తిరుపతి, బెంగళూరులోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై నాలుగు సిట్ బృందాలు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నివాసంలో మిథున్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

 

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో (2019-2024) మద్యం విధానంలో సుమారు రూ. 3,200 కోట్లకు పైగా అవినీతి జరిగిందని సిట్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

 

ఈ తనిఖీల్లో భాగంగా అధికారులు కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీల రికార్డులు, ఎలక్ట్రానిక్ పరికరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో మిథున్ రెడ్డిని జూలైలో అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించగా, ఆ తర్వాత ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. కేసు విచారణలో భాగంగా గతంలోనూ విచారించారు. సిట్ దాఖలు చేసిన 300 పేజీల చార్జ్‌షీట్‌లో మిథున్ రెడ్డిని నాలుగో నిందితుడిగా (ఏ-4) చేర్చారు.

 

మరోవైపు, ఈ దాడులను వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలేనని, చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను వేధిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెర్ని నాని, అంబటి రాంబాబు తదితరులు ఆరోపించారు. మిథున్ రెడ్డి తన ఆస్తులన్నింటినీ ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారని, ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని వారు స్పష్టం చేశారు. తాము న్యాయస్థానాల్లో పోరాడి నిజం నిరూపిస్తామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మిథున్ రెడ్డి ఇటీవల కేంద్ర హోంమంత్రికి లేఖ రాయడం, అమెరికా పర్యటనకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం వంటి పరిణామాల నడుమ ఈ సోదాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.