AP

భీమవరం డీఎస్పీ వివాదం: డిప్యూటీ సీఎం ఫిర్యాదుపై డిప్యూటీ స్పీకర్ క్లీన్ చిట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. పేకాట శిబిరాలు, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు డీఎస్పీ జయసూర్యపై వచ్చాయి. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు చేరడంతో, ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఈ వ్యవహారంపై మాట్లాడారు. డీఎస్పీపై నివేదిక ఇవ్వాలని ఎస్పీని ఆదేశిస్తూ, అసాంఘిక కార్యక్రమాలకు అండగా ఉండటాన్ని ప్రభుత్వం ఉపేక్షించదని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసి నివేదిక కోరిన నేపథ్యంలో, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీఎస్పీ జయసూర్యకు మద్దతుగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకున్న సమాచారం మేరకు డీఎస్పీ జయసూర్యకు మంచి ట్రాక్‌ రికార్డు ఉందని రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో పేకాట, జూదంపై పోలీసులు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం వల్లే ఆయనపై అభియోగాలు వస్తున్నాయేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. డీఎస్పీ తీరుపై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తే, డిప్యూటీ స్పీకర్ ఆయనకు అనుకూలంగా మాట్లాడటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా భేటీ అయినట్లు సమాచారం. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నట్లు తెలిసింది. డీఎస్పీ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం ఆగ్రహం, డిప్యూటీ స్పీకర్ మద్దతు నేపథ్యంలో ప్రభుత్వ విచారణలో ఎలాంటి విషయాలు వెల్లడవుతాయో చూడాలి.