AP

తుఫాన్ బాధితుల పరామర్శ: పవన్ కల్యాణ్ గ్రౌండ్ విజిట్‌తో వైసీపీ విమర్శలకు చెక్?

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మొంథా తుఫాన్ విపత్తు సమయంలో క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఫీల్డ్ విజిట్‌లు చేసి, అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ వైసీపీ పలుమార్లు పవన్‌పై విమర్శలు చేసింది. అయితే, తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన సేనాని, నీళ్లు, బురదను లెక్క చేయకుండా పొలాల్లోకి వెళ్లి రైతులను పరామర్శించడం, వారి సమస్యలను వినడం ద్వారా వైసీపీ విమర్శలకు చెక్ చెప్పినట్లుగా కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పవన్ కూడా గ్రౌండ్ లెవల్‌లో పర్యటించి జరిగిన నష్టంపై ఆరా తీశారు. గతంలో, పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలకు ఇష్టపడేవారు కాదు, ఎందుకంటే తాను వెళ్తే అభిమానుల హడావుడి, సెల్ఫీలు, స్లోగన్స్‌తో అసలు సమస్య పక్కదారి పడుతుందని భావించేవారు. అయితే ఇప్పుడు, డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయి పర్యటనలో ఎక్కువ సేపు గడపటం, రైతులు తమ సమస్యలను నేరుగా వినడంతోనే సమయం గడిపారు. తన పర్యటనలో ఎక్కడా హంగామా కనిపించలేదని, పవన్ చూపించిన చొరవ రైతులను ఆకట్టుకుందని అంటున్నారు.

రాజకీయ తెరపై పవర్‌ఫుల్ లీడర్‌గా ఉన్న పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు మోస్తూనే జనాలతో మమేకం అవుతున్నారు. తుఫాన్ బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన ఆలయాలను సందర్శించడం, రోడ్డు పక్కన వ్యాపారులతో మాట్లాడటం వంటివి చేశారు. పూర్తిస్థాయి పొలిటికల్ లీడర్‌గా, బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పోస్ట్‌లో పవన్ చూపించిన ఈ చొరవపై జనసేన క్యాడర్ కూడా సంతోషంగా ఉంది. మొత్తానికి, పవన్ ఫీల్డ్ విజిట్‌లు, రైతులను పరామర్శించి ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం అనేది వైసీపీ విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.