ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున పారిశ్రామిక ప్రగతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. శుక్రవారం జరిగిన 12వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో రూ. 1,01,899 కోట్ల విలువైన 26 పారిశ్రామిక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయబడింది. ఈ భారీ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 85,570 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టులు కేవలం ఆమోదం పొందితే సరిపోదని, అవి క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చేలా (గ్రౌండ్ అయ్యేలా) చూడాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో మూడు నగరాలను మెగా సిటీలుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. విశాఖ (అనకాపల్లి నుంచి విజయనగరం వరకు), అమరావతి, మరియు తిరుపతి నగరాలను మెగా సిటీలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అమరావతికి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఉండగా, విశాఖ, తిరుపతిలకు కూడా వెంటనే మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ఈ నగరాలను టూరిజం, ఐటీ సహా వివిధ పరిశ్రమలకు కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని, దీనికోసం మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ, పర్యాటక శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని, చిప్, సెమీ కండక్టర్లు, డ్రోన్ల తయారీ వంటి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటుపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పెట్టుబడుల సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సహా ఇతర మంత్రులు ఈ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలిపారు.

