AP

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అంజలి, శ్రీనివాస్ రెడ్డి

సినీనటి అంజలి గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెతో పాటు నటుడు శ్రీనివాస్ రెడ్డి కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో వీరు శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిత్యం లక్షలాది మంది భక్తులు, ముఖ్యంగా వీఐపీలు స్వామివారిని దర్శించుకునే క్రమంలో, వీరు కూడా ప్రత్యేక దర్శన భాగ్యం పొందారు.

తిరుమలేశుడిని దర్శించుకున్న అనంతరం, హీరోయిన్ అంజలి, నటుడు శ్రీనివాస్ రెడ్డికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు వారికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన అంజలి, శ్రీవారి సన్నిధికి వస్తే తెలియని ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని, స్వామి వారి దర్శన భాగ్యం చాలా బాగా జరిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇక తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. గురువారం నాడు 72,283 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనానంతరం హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ 4.54 కోట్ల రూపాయలు సమర్పించుకున్నారు. ప్రస్తుతం సర్వ దర్శనానికి 8 నుండి 10 గంటల సమయం పడుతోందని సమాచారం.