ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇద్దరూ కూటమిలోని ఎమ్మెల్యేల పనితీరుపై పదే పదే అసహనం వ్యక్తం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు సివిల్ తగాదాల్లో తలదూర్చడాన్ని పవన్ కల్యాణ్ తప్పుపట్టారు. కూటమిలోని ప్రధాన పార్టీల పెద్దలు ఇలా బహిరంగంగా వ్యాఖ్యానించడం ద్వారా, పార్టీ గాడి తప్పినట్లు అంగీకరించినట్లయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వస్తే, అది ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఈ విషయం చంద్రబాబుకు తెలియంది కాదని విశ్లేషణలు వస్తున్నాయి.
ఎమ్మెల్యేల పనితీరు ఎంత ముఖ్యమో, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యుల పనితీరు కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికలు జరిగి రెండేళ్లు దాటిపోయిన నేపథ్యంలో, ఇప్పుడు కూడా ప్రతిదానికీ గత ప్రభుత్వంపై నెపాన్ని మోపి కాలం గడిపేద్దామంటే కుదరదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా, ప్రభుత్వం ‘మంచి పనులు’ అని చెప్పే సంక్షేమ పథకాలు కేవలం కొద్ది మందికి మాత్రమే అంది, మెజారిటీ ప్రజలకు ప్రయోజనం దక్కకపోతే, అది ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీస్తుందని గత ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా చూపుతున్నారు.
ప్రభుత్వం సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో తీసుకెళుతున్నామని చెబుతున్నప్పటికీ, రహదారులు బాగుండటం, రైతులు, నిరుద్యోగులు, మహిళలు సంతోషంగా ఉండటం వంటి అంశాలు ప్రజల్లో ‘ఫీల్ గుడ్’ను కలిగిస్తాయని పేర్కొంటున్నారు. సంక్షేమ పథకాలను కొందరికే ఇచ్చి, ఎమ్మెల్యేల పనితీరును తప్పుపడితే చివరకు పుట్టి మునిగే ప్రమాదం ఉందని, ఈ విషయాన్ని ముఖ్య నేతలు గమనించాలని కిందిస్థాయి నేతలు కోరుకుంటున్నారు. పార్టీ నిలదొక్కుకోవడానికి కార్యకర్తలు కూడా కీలకమని గుర్తించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

