AP

ఆరేళ్ల తర్వాత నాంపల్లి సీబీఐ కోర్టుకు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.యస్. జగన్‌ మోహన్ రెడ్డి, తన అక్రమాస్తుల కేసుకు సంబంధించి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావడం ఇదే మొదటిసారి. 2013 సెప్టెంబరు నుంచి ఈ కేసుల్లో బెయిల్‌పై ఉన్న జగన్, గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. అయితే, డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 21వ తేదీలోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించగా, జగన్ ఒక రోజు ముందే నవంబర్ 20 (గురువారం) కోర్టుకు హాజరయ్యారు.

కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జగన్ కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధమవడంతో, హైదరాబాద్ పోలీసులు నాంపల్లి క్రిమినల్ కోర్టు పరిసరాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కోర్టు ప్రాంగణంలో వైసీపీ శ్రేణులు నినాదాలు చేస్తూ హడావుడి సృష్టించారు. కోర్టులో విచారణ అనంతరం ఆయన లోటస్ పాండ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.

సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జిషీట్‌లు ఈ కేసుల్లో ఉన్నాయి. తన తండ్రి (దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి) అధికారాన్ని అడ్డుపెట్టుకుని, క్విడ్ ప్రో కో ద్వారా ఆస్తులు కూడబెట్టారని సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసులో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా, డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ అభ్యంతరం చెప్పడంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.