ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తాత్కాలిక రాజధానిగా ఉన్న అమరావతికి అధికారికంగా, చట్టబద్ధమైన రాజధాని హోదా కల్పించే ప్రక్రియ వేగవంతమైంది. కూటమి ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 5(2) ను సవరించడానికి కేంద్రం చకచకా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ సవరణ బిల్లుకు కేంద్ర న్యాయ శాఖ ఆమోదం లభించింది. ఇప్పుడు ఈ బిల్లు కేంద్ర మంత్రివర్గ ఆమోదం కోసం సిద్ధంగా ఉంది.
కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిన వెంటనే, ఈ బిల్లును ఈ నెలలోనే జరిగే పార్లమెంటు శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. పార్లమెంటు ఉభయ సభలు ఈ సవరణ బిల్లును ఆమోదించిన తర్వాత, అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికారిక రాజధానిగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దాదాపు ఐదేళ్లుగా నిలిచిపోయిన రాజధాని చట్టబద్ధత ప్రక్రియ వేగం పుంజుకోవడంపై అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లును ప్రస్తుత కూటమి ప్రభుత్వం రద్దు చేసి, అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ విషయమై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధాని నరేంద్ర మోదీతో పలుమార్లు చర్చించారు. ఇదిలా ఉండగా, అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి రెండో దశ భూసేకరణ తప్పదని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో 7 గ్రామాల పరిధిలో మరో 16,666 ఎకరాల భూసమీకరణకు సీఆర్డీఏకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

