AP

ఐపీఎస్ అధికారి సంజయ్‌కు బిగ్ రిలీఫ్: 112 రోజుల తర్వాత బెయిల్ మంజూరు

ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేశారనే అభియోగాలపై అరెస్టయిన ఐపీఎస్ అధికారి సంజయ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సంజయ్.. అగ్నిమాపక శాఖ డీజీ, సీఐడీ ఏడీజీగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయన అక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగాలు రావడంతో, ఏసీబీ (Anti-Corruption Bureau) ఆయనపై కేసు నమోదు చేసింది.

దర్యాప్తులో భాగంగా సంజయ్‌ను అరెస్ట్ చేయగా, అప్పటి నుంచి సుమారు 112 రోజులుగా ఆయన విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ఈ కాలంలో సంజయ్ బెయిల్ కోరుతూ పలుసార్లు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, ఏసీబీ కోర్టు ఈ బెయిల్ పిటిషన్లను పలుమార్లు కొట్టివేసింది.

ఎట్టకేలకు సోమవారం (డిసెంబర్ 15) సంజయ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో 112 రోజులుగా రిమాండ్‌లో ఉన్న ఐపీఎస్‌ అధికారికి బెయిల్ లభించడంతో, ఆయనకు బిగ్ రిలీఫ్ దొరికినట్లయింది. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే, బెయిల్ మంజూరు కావడంతో తాత్కాలికంగా ఆయనకు ఊరట లభించింది.